Srisailam | అచ్చంపేట, జనవరి 1: నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్తు కేంద్రం వద్ద వారం రోజులుగా నీరు లీక్ అవుతున్నది. యూనిట్-1 జీరో ఫ్లోర్ డ్రాఫ్ట్ ట్యూబ్ నుంచి నీటి ధార పడుతున్నది. ఈ విషయాన్ని గత నెల 25న షిఫ్ట్ అధికారులు గుర్తించి పైఅధికారులకు సమాచారమిచ్చారు. దీంతో జెన్కో అధికారులు పరిశీలించి ఉన్నతాధికారులకు వివరించగా.. హైదరాబాద్ విద్యుత్తు సౌధ నుంచి జనరల్ సర్వీసెస్ సివిల్ సీఈ హైడల్ నారాయణ వచ్చి పరిశీలించారు.
లీకేజీకి సంబంధించి నివేదిక ఇవ్వాలని ఇంజినీర్లను ఆదేశించి.. లీకేజీని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. అయితే రివర్స్ విద్యుత్తు ఉత్పత్తి చేయడంతో వైబ్రేషన్ కారణంగా నీటి ఒత్తిడి పెరిగి లోపల ఉన్న పైపు వెల్డింగ్ నుంచి లీకేజీ కొనసాగుతున్నట్టు అధికారులు భావిస్తున్నారు. సర్జిచాంబర్, పెన్‌స్టాక్ గేట్లను మూసివేసి, టర్బయిన్‌లో నిల్వ ఉండే నీటిని పూర్తిగా తొలగించి లోపలికి వెళ్లి పరిశీలించాల్సి ఉంటుంది.
నాగార్జున సాగర్‌లో వాటర్ లెవల్ తగ్గితేనే పరిశీలించే అవకాశం ఉన్నదని ఎస్ఈ (సివిల్) రవీంద్రకుమార్ తెలిపారు. ప్రస్తుతానికి ప్రమాదమేమీ లేదని, కాంక్రీట్‌కు వెల్డింగ్ చేస్తే సరిపోతుందని పేర్కొన్నారు. చిన్న నీటిధారతో ఎలాంటి ప్రమాదం లేదని, రివర్స్ పంపింగ్ విద్యుత్తు ఉత్పత్తిని నిలిపివేశామని సీఈ రామసుబ్బారెడ్డి తెలిపారు.