High Court | హైదరాబాద్, మార్చి13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నదని, ముప్పు పొంచి ఉన్నదని, నీటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని లేదంటే బెంగళూరులో ఉన్న తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. నీటి కోసం బెంగళూరు అవస్థలు పడుతున్నదని, ఆ దుస్థితి హైదరాబాద్‌కు రాకుండా పాలకులు, అధికారులు మేలొనాలని ఆదేశించింది. నీటి వినియోగం, అమలు తీరుపై ఈ నెల 16లోగా నివేదిక అందజేయాలని ఆదేశించింది. హైదరాబాద్ -సికింద్రాబాద్ జంటనగరాల్లో తీవ్ర నీటి కొరత ఏర్పడిందని, అధికారులు తగిన చర్యలు తీసుకోవాలంటూ పీఆర్ సుభాష్‌చంద్రన్ 2005లో రాసిన లేఖను హైకోర్టు పిటిషన్‌గా పరిగణించి విచారణ జరుపుతున్నది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్‌కుమార్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం ఈ అంశంపై మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ లేఖ రాసే నాటికి ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని ప్రభుత్వం చెప్పడంతో హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇదేమీ ప్రభుత్వ వ్యతిరేక వ్యవహారం కాదని తేల్చి చెప్పింది. నీరు ప్రజలకుచెందిన నిత్యకృత్యమని స్పష్టం చేసింది. నీటిని రీసైక్లింగ్ ద్వారా వాడుకునేలా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. రీసైక్లింగ్ ప్లాంట్ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని పేర్కొంది.
ఇంకుడుగుంతలు పరిశీలించాలి
భవన నిర్మాణాలన్నింటినీ పరిశీలించి ఇంకుడు గుంతలు లేనివాటిని గుర్తించాలని మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలనే నిబంధనల అమలుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శికి ఉత్తర్వులు జారీచేసింది. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రతి ఇంటి యజమానికి కనీసం 6 మొకలు సరఫరా చేయాలని గుర్తుచేసింది. మొకలను నాటిన తర్వాత వాటి సంరక్షణ బాధ్యత ఇంటి యజమానిదేనని, విఫలమైతే ఆస్తి పన్నుతో సమానంగా జరిమానా విధించాలని గుర్తుచేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బోర్లు వాల్టా చట్ట నిబంధనలకు లోబడి ఉన్నాయో లేదో భూగర్భ జల శాఖ అధ్యయనం చేసి నిబంధనల అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వర్షపు నీటిని ఒడిసి పుచ్చుకోవాలని తెలిపింది.
‘వాల్టా’ అమలుకు చర్యలు తీసుకోవాలి
బిల్డింగ్ నిబంధనలకు సవరణ చేస్తూ గత ఏడాది మార్చి 31న జారీ చేసిన జీవో అమలుకు తీసుకున్న చర్యలపై నివేదిక అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2002 వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్ (వాల్టా) లోని 11వ సెక్షన్ అమలుకు చర్యలు తీసుకోవాలని, భూగర్భ జలాల రక్షణకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పింది. భూమి నుంచి నీటిని తోడటం మాత్రమే కాదు.. ఆ భూమిలోకి వర్షపు నీరు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. బోర్లు బావులు ఎండిపోకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. నీటి సంరక్షణ, పంపిణీని 3 నుంచి 5వ తరగతి అవసరమైతే 8వ తరగతి విద్యార్థుల వరకు పాఠ్యాంశం చేసే విషయాన్ని పరిశీలించాలని సూచించింది. నీటి సంరక్షణకు జారీచేసిన ఆదేశాల అమలుకు వాచ్డాగ్ కమిటీలను ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని ఆదేశించింది.
ప్రభుత్వ తీరుపై అసహనం
హైకోర్టు.. గతంలో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ, ప్రభుత్వ కౌంటర్ పిటిషన్లు, కోర్టు సహాయకుడిగా (అమికస్ క్యూరీ) నియమితులైన సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి సమర్పించిన నివేదికలను పరిశీలించింది. 2005 తీవ్ర నీటి ఎద్దడి పరిస్థితులు ఇప్పుడు లేవని, అయినా నీటి సంరక్షణ చర్య లు తీసుకోవాలని ప్రకాశ్‌రెడ్డి చెప్పారు. నీటి సంరక్షణకు ఆయన పలు సూచనలు చేశారు. 2005 నాటి పరిస్థితులు ఇప్పడు లేవని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చెప్పడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. నీటి ఎద్దడి బెంగళూరులో ఎంతగా ఉందో చూస్తే తెలుస్తుందని, నీరు నిత్యావసర అంశమని గుర్తుచేసింది. సమస్యను తీవ్రంగా పరిగణించాలని చెప్పింది. ఇదేదో ప్రభుత్వ వ్యతిరేక వ్యవహారమని భావించకూడదని హితవు పలికింది. అమికస్‌క్యూరీ ఇచ్చిన నివేదికపై ప్రభు త్వం సానుకూలంగా స్పందించాలని సూచించింది. తమ ఆదేశాల అమలుపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్‌ఖాన్‌ను కోరింది. విచారణను 16కు వాయిదా వేసింది.