అమ్రాబాద్, అక్టోబర్ 8 : ఓట్ల కోసం తమను ప్రలోభాలకు గురిచేయొద్దంటూ స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థులకు రెండు గ్రామాల ప్రజలు సామాజిక మాధ్యమాల్లో హెచ్చరించిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమకు ఎలాంటి ఆశ చూపొద్దని పదర మండలంలోని చిట్లంకుంట, పెట్రాల్చేను గ్రామస్థులు సూచించారు.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డుమెంబర్లుగా పోటీచేసే వారు మద్యం, భోజనం, డబ్బులు ఆశ చూపొద్దని, తమను మభ్యపెట్టి వాటికి బానిసలను చేయొద్దని విజ్ఞప్తి చేశారు. అభ్యర్థులు ఓట్ల కోసం వెచ్చించే డబ్బులను అభివృద్ధి పనులకు వినియోగించాలని సూచిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో వైరల్ అయ్యింది.