హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్న జర్నలిస్టులపై కక్షపూరితంగా కేసులు పెట్టడం దుర్మార్గమని, ఖమ్మం న్యూస్ ప్రతినిధి సాంబశివరావుపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆసాని మారుతీసాగర్ డిమాండ్ చేశారు. రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్19(1) ఏ మీడియా స్వేచ్ఛ హకును హరించేలా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు సోమవారం తెమ్జూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ రమణకుమార్, కార్యవర్గంతో కలిసి లోయర్‌ట్యాంక్‌బండ్‌లోని మినీ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు.
మీడియా స్వేచ్ఛను కాపాడాలని నినాదాలు చేశారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, డీజీపీ జితేందర్‌కు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మారుతీసాగర్, రమణకుమార్ మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను రిపోర్టు చేస్తున్న టీన్యూస్ బ్యూరో చీఫ్ సాంబశివరావుపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కేసు వివరాలు తెలుసుకొని సమస్యను పరిషరించేందుకు ప్రయత్నిస్తానని డీజీపీ తనను కలిసిన జర్నలిస్టు నాయకులకు హామీ ఇచ్చారు.
అనంతరం మారుతీసాగర్ మీడియాతో మాట్లాడుతూ.. జర్నలిస్టులపై కక్షపూరితంగా కేసులు పెట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు. సాంబశివరావుపై కేసులు ఎత్తివేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కోశాధికారి యోగానంద్, నవీన్‌కుమార్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు రాకేశ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్, కోశాధికారి బాబురావు, రాష్ట్ర నాయకులు సూరజ్ భరద్వాజ్, శివారెడ్డి, శ్రీధర్‌ప్రసాద్, భాసర్, చిన్న పత్రికల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.