Tourism | ఖిలా వరంగల్ : జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. శనివారం వరంగల్ జిల్లా కలెక్టరేట్లోని బీసీ హాలులో సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాను పర్యాటక రంగంగా అభివృద్ధి చేసేందుకు అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులకు కనీస మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. జిల్లాలోని గీసుకొండ మండలం మొగిలిచర్ల గ్రామంలో ఏకవీర దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలన్నారు. యునెస్కోలో గుర్తింపు పొందే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. దేవాలయానికి ఏర్పాటు చేసిన హద్దులలో చెట్లతో గ్రీన్ ప్రహరీని ఏర్పాటు చేయాలన్నారు. అలాగే గ్రామంలో అక్కడక్కడ పడి ఉన్న 55 శిల్పాలను ఏకవీర దేవాలయం ప్రాంగణానికి తరలించి మినీ మ్యూజియంగాని లేదా పార్కును ఏర్పాటు చేయాలన్నారు.
పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు నిధుల కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలన్నారు. పాకాల సరస్సులో బోటింగ్, బట్టర్ ఫ్లై పార్క్, కాలేజీలు ఏర్పాటు చేసి ఏకో టూరిజంగా అభివృద్ధి చేశామన్నారు. అలాగే పక్షుల పార్కు పురావస్తు శాఖ మ్యూజియం కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హోం స్టే కోసం పాకాల సమీపంలో కోయతేగా గ్రామాన్ని గుర్తించాలని అటవీశాఖ అధికారులకు సూచించారు. జిల్లాలో శిల్పారామం ఏర్పాటుకు మూడు నుంచి ఐదు ఎకరాల స్థలాన్ని గుర్తించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. పర్యాటక ప్రాంతాలలో సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి పర్యాటక ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం కార్యాచరణ రూపొందించాలన్నారు. జిల్లావ్యాప్తంగా వివిధ పాఠశాలలు కళాశాలలో ఏర్పాటుచేసిన సుమారు 500 ఇవ్వ టూరిజం క్లబ్ లకు పర్యాటక రంగంపై అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ జి సంధ్యారాణి, డిటిఓ శివాజీ, డిఆర్ఓ విజయలక్ష్మి, ఇంటెక్ కో కన్వీనర్ పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు.