హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 25 : ఓ వార్డెన్ ముగ్గురు విద్యార్థులను చితకబాదగా.. ఓ విద్యార్థి చెయ్యి విరిగింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా కాకాజీకాలనీలోని ఎస్సీ బాలుర హాస్టల్లో ఆలస్యంగా వెలుగుచూసింది. విద్యార్థులు, తల్లిదండ్రుల కథనం ప్రకారం.. కాలనీలో ఒకే కాంపౌండ్‌లో రెండు ఎస్సీ సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. ఎస్సీ బాలుర ఆనంద నిలయం ఏ బ్లాక్, ఎస్సీ బాలుర హాస్టల్ బీ బ్లాక్ ఉన్నాయి. రెండు హాస్టళ్ల విద్యార్థులకు నాలుగు బాత్రూంలు ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం ఎస్సీ బాలుర ఆనంద నిలయం హాస్టల్లో ఉంటూ హనుమకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న మడికొండకు చెందిన రాజారపు సందీప్, నర్సంపేటకు చెందిన ధనుష్, ఎస్సీ బాలుర హాస్టల్లో ఉంటున్న వరంగల్‌కు చెందిన సాంబశివ సిగరెట్ తాగారని ఎస్సీ బాలుర హాస్టల్ వార్డెన్ సదానందం కర్రతో చితకబాదగా తీవ్ర గాయాలయ్యాయి. సందీప్ చెయ్యివిరిగింది.
అంతకుముందే హాస్టల్లో పనిచేసే సిబ్బంది ఎవరో బాత్రూంలో సిగరెట్ తాగి బయటకు రావడం, అప్పుడే ఈ ముగ్గురు విద్యార్థులు బాత్రూంలోకి వెళ్లిరావడాన్ని చూసిన వార్డెన్ సదానందం వారే సిగరెట్ తాగారని భావించి చితకబాదాడు. చేయని తప్పుకు తమను కొడుతున్నారని విద్యార్థులు విలపించారు. ఘటన జరిగి మూడురోజులైనా ఆనంద నిలయం హాస్టల్ వార్డెన్ అర్చన, ఎస్సీ బాలుర హాస్టల్ వార్డెన్ సదానందం సమాచారం ఇవ్వకపోవడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. విద్యార్థులను దారుణంగా కొట్టిన వార్డెన్ సదానందం, తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అర్చనపై వెంటనే చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. వీరిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.