హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): వరంగల్‌లోని కాకతీయ జూలాజికల్ పార్క్ (జంతు ప్రదర్శన శాల) త్వరలో మరిన్ని హంగులను సంతరించుకునే అవకాశం ఉన్నది. ప్రస్తుతం స్మాల్ క్యాటగిరీలో ఉన్న ఈ జూపార్క్‌ను మీడియం క్యాటగిరీకి అప్‌గ్రేడ్ చేయాలని రాష్ట్ర అటవీశాఖ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దీంతో కాకతీయ జూపార్క్‌లో కొత్త ఎన్క్లోజర్ల ఏర్పాటు, వాటి నిర్వహణకు సంబంధించిన ఆర్థిక వివరాలను నివేదించాలని సెంట్రల్ జూ అథారిటీ (సీజెడ్ఏ) టెక్నికల్ కమిటీ రాష్ట్ర అటవీశాఖను కోరింది.
ఈ వివరాలు అందిన వెంటనే కాకతీయ జూపార్క్‌ను మీడియం క్యాటగిరీకి అప్‌గ్రేడ్ చేయనున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం దాదాపు 50 ఎకరాల్లో ఈ పార్క్ విస్తరించి ఉన్నది. అప్‌గ్రెడేషన్ అనంతరం ఈ జూపార్క్‌లో పులులు, ఇండియన్ గౌర్ (బైసన్) ఎన్క్లోజర్లను ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.