Warangal NIT | హనుమకొండ చౌరస్తా, నవంబర్ 7: వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) సరికొత్త రికార్డును నమోదు చేసుకుంది. గతంలో రూ.88 లక్షల ప్యాకేజీని అధికమించి అత్యధికమైన రూ.1.27 కోట్లు దేశీయ ప్యాకేజీ ఆఫర్ లభించింది. ప్లేస్మెంట్ సీజన్ 2025-26 ప్రారంభ దశలోనే వచ్చిన అద్భుత ఫలితాలు సంస్థ బలమైన విద్యా పునాది, పరిశ్రమలతో ఉన్న సన్నిహిత బంధాలు, విద్యార్థుల అసాధారణ ప్రతిభను ప్రతిబింబిస్తున్నాయి.
నిట్ చరిత్రలో అత్యధిక దేశీయ ఆఫర్ రూ.1.27 కోట్ల జాబ్ ఆఫర్ ఉత్తరప్రదేశ్ నోయిడాకి చెందిన కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన బీటెక్ విద్యార్థి నారాయణ త్యాగి బహుళజాతి కంపెనీ నుంచి రూ.1.27 కోట్ల సీటీసీతో దేశీయ ఆఫర్‌ను పొందారు. ఇది వరంగల్ నిట్ చరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ప్యాకేజీ. అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన విద్యార్థి మొహమ్మద్ నహిల్ నష్వాన్ రూ.1 కోటి సీటీసీతో దేశీయ ఆఫర్‌ను పొందారు.
ఈ ఘనతలు వరంగల్ నిట్‌ను దేశంలోని అగ్రశ్రేణి ఇంజనీరింగ్ విద్యాసంస్థలలో ఒకటిగా నిలబెట్టారని, అంతర్జాతీయ ప్రమాణాల విద్యార్థులను తీర్చిదిద్దుతున్నట్లు మరోసారి నిరూపించాయని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి తెలిపారు. 2025-26 ప్లేస్మెంట్ డ్రైవ్ ప్రారంభ రెండు నెలల వ్యవధిలోనే విభిన్న శాఖల విద్యార్థులు అత్యుత్తమ అవకాశాలను సాధించారని చెప్పారు.
ఇప్పటివరకు ప్లేస్మెంట్ సీజన్ తొలి రెండు నెలల్లో రూ.70 లక్షలకు పైగా సీటీసీతో 6 మంది విద్యార్థులు ఆఫర్లు పొందారని, రూ.50 లక్షలకుపైగా సీటీసీతో 34 మంది, రూ.30 లక్షలకుపైగా సీటీసీతో 125 మంది, రూ.25 లక్షలకుపైగా సీటీసీతో 163 మంది, రూ.20 లక్షలకుపైగా సీటీసీతో 200 మందికి పైగా విద్యార్థులు ఆఫర్లు పొందారని తెలిపారు. అక్టోబర్ 15 వరకు సగటు ప్యాకేజీ రూ.26 లక్షలను దాటిందని చెప్పారు. ప్లేస్ మెంట్ సీజన్ ఇంకా కొనసాగుతూనే ఉందని, ఇంకా చాలామంది ప్రతిభావంతులైన విద్యార్థులు అవకాశాల కోసం అందుబాటులో ఉన్నారన్నారు. అనేక ప్రముఖ సంస్థలు క్యాంపస్ సందర్శనకు సిద్ధంగా ఉన్నాయని, రాబోయే నెలల్లో మరిన్ని అధిక విలువ గల ఆఫర్లు వచ్చే అవకాశముందని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి తెలిపారు. అత్యధిక ప్యాకేజీలు పొందిన విద్యార్థులందరికీ, అధ్యాపకులకు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ప్లేస్మెంట్ సీజన్ విద్యార్థుల ప్రతిభ, పరిశ్రమలకు అనుగుణమైన నైపుణ్యాలు, సంస్థపై రిక్రూటర్ల నమ్మకాన్ని స్పష్టంగా చూపిస్తోందన్నారు. ఈ విజయాన్ని సాధించడంలో కీలకపాత్ర పోషించిన సెంటర్ ఫర్ కెరీర్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ (సీసీపీడీ) బృందానికి, హెడ్ ప్రొఫెసర్ పి.వి.సురేష్‌కు నిట్ డైరెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.

మాది ఉత్తరప్రదేశ్ నోయిడా.. అమ్మ కెమిస్ట్రీ టీచర్, నాన్న ఇంజనీర్. నేను ఇంజనీర్ల కుటుంబం నుంచి వచ్చాను. అమ్మ బోధనపై ఉన్న ఆసక్తితో నన్ను సైన్స్ వైపు ఆకర్షించగా నాన్న క్రమశిక్షణ, పట్టుదల విలువలను నాకు నేర్పించారు. వారి సంయుక్త ప్రభావం వలనే నా చిన్ననాటి నుంచే గేమింగ్, సాంకేతికతపై ఉన్న ఆసక్తి కంప్యూటర్ సైన్స్ వైపు నన్ను నడిపించింది.
నేను ఎల్లప్పుడూ నన్ను సవాలు చేసుకుంటూ, విభిన్న అనుభవాలను సంపాదించి, నేను చేసే ప్రతి ప్రయత్నానికి అర్థవంతమైన దోహదం చేయాలని కోరుకుంటున్నాను.
నా కుటుంబానికి వారి నిరంతర మార్గనిర్దేశం ప్రోత్సాహానికి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మంచి ప్లేస్మెంట్ సాధించడానికి సహకరించిన వరంగల్ నిట్ ప్లేస్మెంట్ సెల్‌కు కూడా నా కృతజ్ఞతలు. నా జీవిత లక్ష్యం ఎక్కువగా నేర్చుకోవడం, అనేక రంగాలను అన్వేషించడం, నా వ్యక్తిగత అభివృద్ధి ప్రయాణంలో ఏదీ మిగిలిపోనివ్వకపోవడం. నా కుటుంబం, వరంగల్ నిట్ ప్లేస్మెంట్ సెల్ ఇచ్చిన ప్రేరణ మద్దతుకు హృదయపూర్వక ధన్యవాదాలు.

నా జీవిత లక్ష్యం నిరంతరం నేర్చుకోవడం, వినమ్రతను కాపాడుకోవడం కొత్త సవాళ్లను స్వీకరించి నా దృష్టి పరిధిని విస్తరించడం. నా తండ్రి మొహమ్మద్ నజీర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. తల్లి నిఖత్ షహీన్ గృహిణి. నా లక్ష్యాలను సాధించేందుకు స్వేచ్ఛను ఇవ్వడంతో పాటు, అశేషమైన త్యాగాలు చేసి ఎల్లప్పుడూ మద్దతు అందించిన మా తల్లిదండ్రులకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. మా అన్న మొహమ్మద్ నౌమాన్ కూడా నాకు నిరంతర ప్రేరణ, ప్రోత్సాహాన్ని అందించారు. రూ.1 కోటి ప్యాకేజీతో జాబ్ ఆఫర్ లభించింది.