దక్షిణాది చిత్రాలకు కాస్త బ్రేక్ నిచ్చిన అగ్ర కథానాయిక రకుల్‌ప్రీత్‌సింగ్ ప్రస్తుతం బాలీవుడ్లో సత్తా చాటుతున్నది. మహిళా ప్రధాన ఇతివృత్తాలతో పాటు ప్రయోగాత్మక కథాంశాల్ని ఎంచుకుంటూ కెరీర్లో దూసుకుపోతున్నది. ఈ ఏడాది ఇప్పటికే ఆమె నటించిన ఐదు చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. రన్‌వే 34, థాంక్గాడ్, అటాక్-1, డాక్టర్ జీ వంటి చిత్రాల్లో ఆమె నటనకు మంచి పేరొచ్చింది. ఈ సందర్భంగా మాట్లాడిన రకుల్‌ప్రీత్‌సింగ్ నటిగా ఎలాంటి పరిమితులు విధించుకోలేదని, ఆకాశమే హద్దుగా ఎదగాలన్నది తన సిద్ధాంతమని చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘కెరీర్లో ఇన్నేళ్లుగా ఉన్నా నటనాపరంగా నా దాహం తీరలేదు. నిత్యం సెట్స్‌లో ఉండటమే నాకు సంతృప్తినిస్తుంది. ఇప్పటికే ఐదు చిత్రాలు రిలీజైనా మరిన్ని సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నా. ఏదో సాధించామని సంతృప్తిచెందితే అక్కడే ఆగిపోతాం. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టాను. నాకు మరింత ఉజ్వలమైన భవిష్యత్తు ఉందనే విశ్వాసంతో పనిచేస్తున్నా’ అని చెప్పింది. ప్రస్తుతం ఈ భామ ఛత్రివాలి, ఇండియన్-2 చిత్రాల్లో నటిస్తున్నది.