హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తప్పులతో నిరుద్యోగులకు ఎన్ని తిప్పలో అంటూ కమిషన్ కర్యాలయం ముందు పోస్టర్లు వెలిశాయి. టీజీపీఎస్సీ అనే నేను ఒక నియంతను, తప్పు అంటే తప్పు.. ఒప్పు అంటే ఒప్పు అంటూ కార్యాలయ గోడలకు, గేట్లకు గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు అంటించారు. గ్రూప్-1లో 150 ప్రశ్నలు తయారు చేయలేని టీజీపీఎస్సీ ఎందుకు.. సిగ్గు సిగ్గు అంటూ పేర్కొన్నారు. గ్రూప్-1 ప్రిలిమినరీలో 150 ప్రశ్నలకు 14 ప్రశ్నలు తప్పుగా వచ్చాయని, గ్రూప్-4లో 300 ప్రశ్నలకుగాను ఎన్ని తప్పులున్నాయో అని సందేహం వ్యక్తంచేశారు. పరీక్షలు కూడా పెట్టలేని స్థితికి టీజీపీఎస్సీ దిగజారిందా అని ప్రశ్నించారు.
మరోవైపు హైదర్‌గూడలోని తెలుగు అకాడమీ ముందు కూడా పోస్టులు అంటించారు. ఎవరూ తెలుగు అకాడమీ బుక్‌లు కొనకండి.. చదవకండి అని పేర్కొన్నారు. తెలుగు అకాడమీ పుస్తకాలు పోటీ పరీక్షలకు ప్రామాణికం కాదని ప్రభుత్వం కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే.