హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): ప్రజలకు సంక్షేమ పథకాలను సమర్థంగా అందించేందుకు, రెవెన్యూ సేవలను నిరంతరంగా కొనసాగించేందుకు, ప్రభుత్వ భూములు కాపాడేందుకు గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేయాలని ట్రెసా ప్రతినిధులు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సోమవారం వారు మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఇతర శాఖల్లోకి పంపిన వీఆర్వోలను ఆప్షన్స్ ద్వారా తిరిగి రెవెన్యూలోకి తీసుకొచ్చి వారి అర్హతలను బట్టి పదోన్నతులు కల్పించాలని కోరారు. చనిపోయిన వీఆర్వోల(178) కుటుంబాలను ఆదుకొని కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్టు నేతలు తెలిపారు. కారుణ్య నియామకాలను నెలరోజుల్లో పూర్తి చేస్తామ ని హామీ ఇచ్చారన్నారు. ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్‌కుమార్, పూర్వ వీఆర్వో జేఏసీ నాయకులు గోలొండ సతీశ్, సుధాకర్‌రావు, సురేశ్‌బాబు పాల్గొన్నారు.