జనగామ, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఓ మహిళా ఓటరు డిమాండ్ చేసింది. ‘నా అమూల్యమైన ఓటుతో గెలిచావు.. కాంగ్రెస్ పార్టీలో చేరినావు.. ఇప్పుడేమో రైతులను అరిగోస పెడుతున్నవు.. వెంటనే ఎమ్మెల్యే పదవి నుంచి తప్పుకోవాలి’ అని సూచిస్తూ జనగామ జిల్లా లింగాలఘనపురం మండల కేంద్రానికి చెందిన ఉడుగుల భాగ్యలక్ష్మి పోస్టుకార్డు రాసింది. ఈ ఉత్తరాన్ని ఆమె హనుమకొండలోని కడియం ఇంటి అడ్రస్‌కు పంపించడం మంగళవారం చర్చనీయాంశంగా మారింది. తాను స్టేషన్‌ఘన్‌పూర్ బీఆర్ఎస్ అభ్యర్థినని, తనను గెలిపించాలని ఎన్నికల సమయంలో కోరితే తాను కారు గుర్తుకు ఓటువేసి గెలిపించానని ఆమె ఆ లేఖలో పే ర్కొంది. ‘గెలిచిన అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరావు.
రైతులను గోసపెడుతున్నావు. అందువల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి’ అని కోరింది. కడియం రాజీనామా చేయాలని ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు ముప్పేట దాడి చేస్తూ ఒత్తిడి పెంచుతుంటే తాజాగా ఓ మహిళ తాను ఓటేసిన పార్టీలో ఉండకుండా ఫిరాయించినందుకు రాజీనామా చేయాలని కోరుతూ పోస్టుకార్డు రాయడం సంచలనంగా మారింది.