హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణను సుప్రీంకోర్టు జూలై నెలకు వాయిదా వేసింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సతీశ్‌చంద్ర మిశ్రా, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ కేసుపై శుక్రవారం విచారణ చేపట్టింది. ప్రతివాదులుగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం, వ్యక్తిగత హోదాలో సీఎం రేవంత్‌రెడ్డి కౌంటర్దాఖలు చేయకపోవడంతో విచారణ జూలైకి వాయి దా పడింది. ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేసేలా ఆదేశించాలని పిటిషనర్ మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి న్యాయస్థానాన్ని కోరారు. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో కేసు విచారణను మధ్యప్రదేశ్‌లోని భోపాల్ కు బదిలీ చేయాలని కోరారు. 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రేవంత్‌రెడ్డి డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేం నరేంద్‌రెడ్డికి ఓటు వేయాలని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సూచనలతోనే స్టీఫెన్సన్ను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించినట్టు ఆరోపణలు వచ్చాయి.