ఎల్కతుర్తి, ఏప్రిల్ 27: బీఆర్ఎస్ రజతోత్సవ సభలో వలంటీర్ల సేవలు అనిర్వచనీయం. బహిరంగ సభ అనుకున్నప్పటి నుంచి సుమారుగా 2,500 మంది పురుష, మహిళ వలంటీర్లను సభ నిర్వాహకులు ఎంపిక చేశారు. వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. బహిరంగ సభ సందర్భంగా గ్రౌండ్, పార్కింగ్, ట్రాఫిక్ ఏరియాలు, వరంగల్-కరీంనగర్-సిద్దిపేట ప్రధాన రహదారుల్లోని పార్కింగ్ స్థలాల్లో వారిని నియమించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు కేటాయించిన స్థలాలను వారికి చూపిస్తూ అక్కడే పార్క్ చేసేలా చూశారు. సభలో కార్యకర్తలు, ప్రజలకు విశేష సేవలు అందించారు. సభకు వచ్చిన ప్రజలకు వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లను అందించారు. ఒకానొక దశలో ప్రజల్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు సైతం వలంటీర్ల సేవలను తీసుకోవడం విశేషం. సభ ముగిసిన తర్వాత సైతం వాహనాలు వెళ్లేందుకు లైన్ క్లియర్ చేస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా చూశారు. మొత్తానికి సభలో వలంటీర్లు చేసిన సేవలకు సభకు వచ్చిన వారు అభినందనలు తెలిపారు.
ఇంటి పండుగలా సేవలందించాం
మన ఇంట్లో పండుగ జరిగితే ఎలా పని చేస్తామో బీఆర్ఎస్ రజతోత్సవ సభకూ అలాగే సేవ చేశాం. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఆ మాత్రం పార్టీకి సేవ చేయడం అదృష్టంగా భావిస్తాం. వలంటీర్‌గా సేవ చేయాలని కోరగా వెంటనే అంగీకరించాను. మాకు ప్రత్యేక టీ షర్ట్లతోపాటు శిక్షణ ఇచ్చారు. సభకు వచ్చే వారి పట్ల మర్యాదగా, సేవాభావంతో మెలగాలని సూచించారు. సభకు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతమైనందుకు సంతోషంగా ఉంది.
– కొమ్ముల సాగర్, వలంటీర్