బంజారాహిల్స్, మే 15 : టీజీపీఎస్సీ వెల్లడించిన గ్రూప్-1 పరీక్షల ఫలితాలపై నిరుద్యోగల పక్షాన గళం విప్పిన ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై, ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించిన నెల రోజుల తర్వాత అట్రాసిటీ కేసు నమోదుచేయడం అనుమానాలకు తావిస్తున్నది. గత నెల 14న తెలంగాణభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి.. గ్రూప్-1 పరీక్షల్లో కొంతమంది అభ్యర్థులకు సీక్వెన్స్‌గా ఎక్కువ మార్కులు రావడం, మాజీ ఎమ్మెల్యే రాములునాయక్ కోడలికి టాప్ ర్యాంక్ రావడంపై పలు అనుమానాలు వ్యక్తంచేశారు. ఈ వ్యవహారంపై సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. అదేరోజు రాములునాయక్ కూడా ప్రెస్‌మీట్ నిర్వహించి తన కోడలు అడ్డదారిలో ర్యాంక్ సాధించలేదంటూ వివరణ ఇచ్చారు. అయితే కౌశిక్‌రెడ్డి చేసిన ఆరోపణలపై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక వివరణ వెలువడలేదు.
నెల క్రితం జరిగిన ప్రెస్మీట్లో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఎక్కడా కులం ప్రస్తావన తేలేదు. రాములునాయక్‌తోపాటు ఆయన కోడలిని కూడా గౌరవప్రదంగానే సంబోధించారు. ఇది జరిగిన నెల తర్వాత రాములునాయక్ సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదుచేయడం, పోలీసులు ఎలాంటి విచారణ చేయకుండానే పాడి కౌశిక్‌రెడ్డి మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం కక్ష సాధింపు చర్యల్లో భాగమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రాములునాయక్ సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, అక్కడ నమోదు చేసిన కేసును బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీచేయడంలో ఆంతర్యం ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది.