హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత 13 రోజులుగా సమ్మె చేస్తున్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ (ఐకేపీ వీవోఏ) శనివారం సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతకను కలిశారు. వీవోఏల జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఉద్యోగుల ప్రధాన సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇరువర్గాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. ఈ చర్చల సందర్భంగా వీవోఏ జేఏసీ ప్రతినిధులు తమ ప్రధాన డిమాండ్లను మంత్రి సీతక ముందుంచారు. వీవోఏలకు నెలకు కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయిలో తాము పడుతున్న ఇబ్బందులు, సామాజిక న్యాయం జరుగాల్సిన ఆవశ్యకతను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగుల డిమాండ్లపై మంత్రి సీతక స్పందిస్తూ.. సమ్మెను విరమించి, రెండు మూడు రోజుల్లో ధర్నా టెంట్లు తొలగిస్తే తాము వేతనాలు పెంచేందుకు సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని, ఆ లోపు సమ్మె విరమించాలని ఆమె కోరారు.
డిమాండ్లు నెరవేరే వరకు టెంట్లు తీయం: జేఏసీ
మంత్రి ప్రతిపాదనపై ఐకేపీ వీవోఏ రాష్ట్ర కమిటీ అత్యవసరంగా సమావేశమై కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసి, వేతనాలు పెంచేంతవరకు ధర్నాచౌక్ నుంచి టెంట్లు తీసే ప్రసక్తే లేదని జేఏసీ స్పష్టంచేసింది. సామాజిక న్యాయం, కనీస వేతనం జీవో వచ్చేంతవరకు నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని రాష్ట్ర కమిటీ పేర్కొన్నది. హామీలను నమ్మి సమ్మె విరమించేది లేదని, పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించింది.