హైదరాబాద్, మార్చి 20, (నమస్తే తెలంగాణ) : ఫ్యూచర్ సిటీ పేరిట ఇన్సైడర్ ట్రేడింగ్ జరుగుతున్నదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. కాంగ్రెస్ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేటాయింపులు చూస్తే చేసింది గోరంత.. చెప్పుకొనేది కొండంత అన్న తీరుగా ఉన్నదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్క సీటు కూడా రాలేదన్న కోపంతో బడ్జెట్లో హైదరాబాద్‌కు నిధులివ్వకుండా ప్రభుత్వం కక్షకట్టిందని తెలిపారు. గురువారం ఆయన తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ ఫ్యూచర్ సిటీ పేరిట ఇన్సైడర్ ట్రేడింగ్ జరుగుతున్నదని, దీని వెనుక ఎవరున్నారన్న విషయం అందరికీ తెలుసునని చెప్పారు. ఫోర్త్‌సిటీలో స్పోర్ట్‌సిటీ, స్కిల్ ఇండియా అంటూ హంగామా చేస్తున్న ప్రభుత్వం అక్కడ కూడా భూదందాకు తెరలేపిందని వెల్లడించారు. తెలంగాణ రాష్ర్టానికి 60 శాతం ఆదాయాన్ని సమకూరుస్తున్న హైదరాబాద్ అభివృద్ధిని పూర్తిగా విస్మరించడం బాధాకరమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో మహానగరం అభివృద్ధికి పెద్దపీట వేసి, మౌలిక వసతులు కల్పించి దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపామని గుర్తుచేశారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా నాడు (బీఆర్ఎస్ హయాంలో) ప్రారంభించిన నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ల నిర్మాణాన్ని పూర్తిచేయడంలో ప్రభుత్వం విఫలమైందని వివేకానంద విమర్శించారు. మెట్రో-2, 3 ఫేస్ విస్తరణకు గతంలో కేటాయించిన నిధులనే విడుదల చేయకపోవడంతో ఓల్డ్ సిటీలో పనులు నత్తనడకన సాగుతున్నాయని వెల్లడించారు. రాయదుర్గం- శంషాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో పనులను కొనసాగించకుండా కేంద్ర నిధుల కోసం ఎదురుచూడడం విడ్డూరంగా ఉన్నదని తెలిపారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటినా చేసిన అభివృద్ధి మాత్రం ఏమీలేదని, భవిష్యత్‌లో చేయబోయే పనులపై స్పష్టత లేదని వివేకానంద దుయ్యబట్టారు. గత బడ్జెట్లో కేటాయించిన నిధులను ఖర్చు చేయకుండానే మళ్లీ కేటాయింపులు జరిపి అంకెలగారడీ చేసిందని చెప్పారు. కేసీఆర్ పాలనలో నిర్మించిన డబుల్బెడ్రూం ఇండ్లపై అసత్యాలు చెబుతున్నదని ఆక్షేపించారు. లక్ష ఇండ్లకు ప్రణాళికలు రూపొందించి 90 వేల ఇండ్లు నిర్మించి, 70 వేల ఇండ్లను పేదలకు పంపిణీ చేశామని తెలిపారు. కాంగ్రెస్ సర్కారు మాత్రం గత ఏడాది 3,000 ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని ప్రగల్బాలు పలికి ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌లో 10 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి శాంతిభద్రతలను కాపాడామని వివేకానంద చెప్పారు. కానీ ప్రస్తుత సర్కారు మాత్రం సీసీ కెమెరాల నిర్వహణలో విఫలంకావడంతో శాంతిభద్రతలు అదుపు తప్పి క్రైమ్‌రేట్ పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో ఐటీ రంగం అద్భుత ప్రగతి సాధించిందని చెప్పారు. 2014-15లో రూ.50వేల కోట్లు ఉన్న ఐటీ ఎగుమతులను 2022-23 నాటికి రూ.2.41 లక్షల కోట్లకు చేర్చిన ఘనత బీఆర్ఎస్ సర్కారుకే దక్కిందని పేర్కొన్నారు. బడ్జెట్ ప్రతిపాదనల్లో మార్పు చేయాలని అసెంబ్లీ వేదికగా పోరాటం చేస్తామని, ప్రభుత్వం దిగిరాకుంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని వివేకానంద హెచ్చరించారు.