TGWREIS | హైదరాబాద్, డిసెంబర్7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యాలయంలో మరే సొసైటీలో, మరో ప్రభుత్వ కార్యాలయంలో లేని కొత్త నిబంధనలు అమలవుతున్నాయి. విజిటింగ్ అవర్స్‌ను మార్చి కేవలం సోమవారం ఒక్కరోజుకే పరిమితం చేశారు. అదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల మధ్య మాత్రమే అవకాశం ఇస్తుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై విద్యార్థి, ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. అదీగాక తల్లిదండ్రులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలు, గురుకుల సొసైటీల్లో ప్రధాన కార్యాలయాల్లో విజిటింగ్ అవర్స్ రోజూ మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు కొనసాగుతున్నాయి. నిర్దేశిత సమయాల్లో ఆయా శాఖల కమిషనర్లు, కార్యదర్శులు, ఉన్నతాధికారులు సైతం ప్రజలను నేరుగా కలవడం పరిపాటి.
ఉద్యోగులు సైతం తమ సమస్యలను ఆయా పనివేళల్లోనే ప్రధాన కార్యాలయాలకు వెళ్లి ఉన్నతాధికారులకు విన్నవించుకుంటున్నారు. గురుకుల సొసైటీల్లోనూ ఇదే తరహా విజిటింగ్ అవర్స్ కొనసాగుతున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉద్యోగులే కాక విద్యార్థి, ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఆ సమయంలో ఉన్నతాధికారులను కలిసి తమ వ్యక్తిగత, శాఖాపరమైన సమస్యలను విన్నవించుకుంటున్నారు. విజ్ఞాపన పత్రాలను అందిస్తుంటారు. ప్రభుత్వం సైతం ప్రజాపాలన పేరిట వారంలో రెండురోజులపాటు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నది. కానీ ప్రస్తుతం సోషల్ వెల్ఫేర్ గురుకుల సొసైటీ మాత్రం అందుకు భిన్నంగా విజిటింగ్ అవర్స్‌ను పూర్తిగా మార్చివేసింది. కేవలం సోమవారం ఒక్కరోజు మాత్రమే, అదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటలకే పరిమితం చేసింది. ఆ సమయంలోనే ప్రధాన కార్యాలయానికి రావాలని ఆంక్షలు విధించడం గమనార్హం.
ఉద్యోగులు ఉలుకరు.. పలుకరు
సోమవారం కాకుండా మరో రోజున ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి సమస్యలు చెప్పుకుందామని ఎంతో ఆశతో వచ్చినా ప్రధాన కార్యాలయ ఉద్యోగులు కనీసం స్పందించడం లేదని విద్యార్థి, ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఏ సొసైటీలో లేనివిధంగా ఆంక్షలు విధించడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. కార్యాలయానికి వచ్చే తల్లిదండ్రులు సైతం తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నారు. ప్రధాన కార్యాలయానికి వచ్చినా ఉన్నతాధికారులెవరూ కలవడమే లేదని, కింద సెక్యూరిటీ సిబ్బందే అడ్డుకొని, వినతులను ఇన్వార్డ్లోనే ఇచ్చిపోవాలని చెప్తూ తిప్పి పంపుతున్నారని వాపోతున్నారు. ఇక తాము ఇచ్చిన ఫిర్యాదులు, వినతులపైనా స్పందించి చర్యలు తీసుకుంటున్నారా? అంటే అదీ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ సొసైటీలో లేనివిధంగా ఇక్కడే విజిటింగ్ అవర్స్‌పై ఆంక్షలు ఎందుకని నిలదీస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా జోక్యం చేసుకోవాలని, గురుకులంలో నెలకొన్న సమస్యలను, పరిస్థితులను తక్షణమే సరిదిద్దాలని విద్యార్థి, ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.