Kaleshwaram | పెద్దపల్లి, జూలై 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జల తపస్వి అని, ఆయన గొప్ప ఆలోచనలతోనే ప్రపంచంలోనే అద్భుత కట్టడం కాళేశ్వరం ప్రాజెక్టు సాధ్యమైందని మహారాష్ట్ర ప్రతినిధి బృందం కీర్తించింది. ‘ఎలా వచ్చింది ఈ ఆలోచన.. వట్టిపోయిన గోదావరిని సజీవంగా మార్చాలని, ఎడారిగా ఉన్న గోదావరిని సజీవంగా మార్చవచ్చని. ప్రాణహిత పరవళ్లను తెలంగాణ బీళ్లకు మరల్చాలని. పారే గోదావరి లాంటి మహానదిపై ప్రపంచంలో ఎక్కడైనా ఇలా అడ్డుకట్టలు కట్టి బ్యారేజీలను కట్టారా? దిగువ నుంచి ఎగువకు నీళ్లను ఎత్తిపోశారా? దిగువ నుంచి ఎగువకు నీటిని పారించడం, అక్కడి నుంచి జలాశయాలను నింపుతూ రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేయడం, వానకాలం ఉన్నా లేకున్నా సాగుకు, తాగుకు నీళ్లివ్వడం ఒక గొప్ప ఆలోచన.. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే ఇది సాధ్యమైంది. దేశంలో కాదు, ప్రపంచంలోనే అసలు ఇలాంటిది సాధ్యమవుతుందని ఎవరూ ఊహించరు. కరువును, కష్టాలను సీఎం కేసీఆర్ కండ్లారా చూశారు కాబట్టే ‘కాళేశ్వరం’ సాధ్యమైంది.
కేంద్రం నుంచి చిల్లి గవ్వ లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వ చేతుల మీద కట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. అసలు ఈ ఆనకట్టలేంది.. ఎత్తిపోతలేందీ.. బాహుబలి మోటార్ల జలగర్జనలు ఏందీ.. సొరంగ మార్గాలను తవ్వి అండర్ టన్నెల్స్ ద్వారా నీటిని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వందల కిలో మీటర్లు తరలించడం ఏమిటి? వృథాగా పోతున్న ప్రాణహిత జలాలను కాళేశ్వరం ద్వారా రాష్ర్టానికి అందించి సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది’ అని రెండు రోజుల కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనలో మహారాష్ట్ర ప్రతినిధి బృందం అన్న మాటలివి.
కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2లోని పెద్దపల్లి జిల్లా నందిమేడారంలోని నంది పంపుహౌస్, కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గా యత్రీ పంపు హౌస్‌లను మహారాష్ట్ర సీనియర్ నాయకుడు, మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన భానుదాస్ మారుటే, అహ్మద్‌నగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ అరుణ్ కదూ, ఎన్సీపీ నేత బాలాసాహెబ్ విఖేపాటిల్తోపాటు మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే అన్నసాహెబ్ మానే, ఘన్‌శ్యాం అన్నా షెలార్, ప్రహ్లాద్ రాథోడ్, శరద్ పవార్, బాలా సాహెబ్, అరుణ్ కొడు, ఏకనాథ్ గోగాడే పరిశీలించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు వంశీధర్‌రావు ఆధ్వర్యంలో వీరు పంప్‌హౌస్‌లను పరిశీలించగా, ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు ప్రాజెక్టు గురించి వివరించారు.
32 దేశాల్లో ఇలాంటి అద్భుత కట్టడం లేదు
32 దేశాలను తిరిగిన తాను ఎక్కడా ఇలాంటి మహాద్భుత కట్టడాన్ని చూడలేదని మహారాష్ట్ర సీనియర్ నాయకుడు భానుదాస్ మార్కుటే అన్నారు. సీఎం కేసీఆర్ మాత్రమే ఇలాంటి అద్భుతాలు చేయగలరని ప్రశంసించారు. ఇంతటి గొప్ప ప్రాజెక్టును కండ్లారా చూసిన తన జన్మ ధన్యమైందని అన్నారు. కాలం గాని కష్టకాలంలో తెలంగాణ రైతాంగానికి వ్యవసాయానికి ప్రాణాధారమైన ప్రాణహిత నది జలాలను ఎత్తిపోస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఖ్యాతి దశదిశలా విస్తరిస్తున్నదని కొనియాడారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ సాగునీటిని అందించి, రైతుల సాగునీటి కష్టాలను తీర్చాలనుకున్న సీఎం కేసీఆర్ కలను నిజం చేస్తూ నేడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నదీ జలాలు ఎగువకు పయనిస్తూ ఎస్సారెస్పీ చేరుకొని రాష్ట్ర సాగునీటి రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం సృష్టించిందని ప్రశంసించారు. ఇలాంటి గొప్ప ప్రాజెక్టును దేశంలోని ప్రతీ ముఖ్యమంత్రి కండ్లారా చూసి ఆ రాష్ట్ర కరువును దూరం చేయవచ్చని పేర్కొన్నారు.