హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొనసాగుతున్న కులగణన సర్వేలో విశ్వబ్రాహ్మణులైన కమ్మరి, వడ్ల, కంచరి, కంసాలి, శిల్పులను వేర్వేరు కులాలుగా పరిగణించవద్దని, ఒకే విశ్వబ్రాహ్మణ కులంగా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టు విశ్వబ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్‌కు చెందిన సీనియర్ అడ్వకేట్ పెందోట శ్రీనివాస్ వెల్లడించారు. హైకోర్టును తీర్పుపై హర్షం వ్యక్తంచేస్తూ ఆదివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో బీసీ కులాలను వర్గీకరించిన జీవోలో కమ్మరి, వడ్ల, కంచరి, కంసాలి, శిల్పులను విశ్వబ్రాహ్మణ కులంగా పేరొన్నారని వివరించారు.
కానీ సర్వే ఫారాల్లో విశ్వబ్రాహ్మణ కులం అని కాకుండా వేర్వేరు కులాల కింద పేర్కొన్నారని, దానివల్ల విశ్వబ్రాహ్మణ కులస్తుల సంఖ్య తగ్గి, రాబోయే కాలంలో ప్రభుత్వ పథకాల్లో తీరని అన్యాయం జరుగుతుందని, ఇదే విషయాన్ని విన్నవించినా సరిచేయకుండా సర్వే చేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించామని, వృత్తిపరంగా కాకుండా కమ్మరి, వడ్ల, కంచరి, కంసాలి, శిల్పులను ఒకే కులంగా పరిగణించేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశామని వెల్లడించారు. పిటిషన్‌ను విచారించిన హైకోర్టు తమ వాదనలను సమర్థించి వారిని ఒకే విశ్వబ్రాహ్మణ కులంగా పరిగణించి సర్వే చేయాలని ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసినట్టు వెల్లడించారు. హైకోర్టుకు విశ్వబ్రాహ్మణ సంఘాల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.