హైదరాబాద్, ఫిబ్రవరి7 (నమస్తే తెలంగాణ) : కులగణన తుది నివేదికలో విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ వృత్తిదారులను విభజించి చూపితే సహించబోమని రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం ప్రభుత్వాన్ని హెచ్చరించింది. సర్వేలో వేర్వేరుగా వివరాలను సేకరించారని ఆగ్రహం వ్యక్తంచేసింది. హైదరాబాద్‌లోని సంఘం కార్యాలయంలో శుక్రవారం సంఘం అధ్యక్షుడు వేములవాడ మదన్మోహన్, గౌరవాధ్యక్షుడు లాలుకోట వెంకటాచారి, ప్రధాన కార్యదర్శి చొల్లేటి కృష్ణమాచార్యులు మీడియాతో మాట్లాడారు. విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జాతీయుల మనోభావాలను కించపరిస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు.
కమ్మర, వడ్రంగి, ఇత్తడి, శిలా శిల్పి, స్వర్ణకార వృత్తులు చేసే పంచదాయ వృత్తిదారులందరినీ కలిపే విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ జాతీయులుగా గత ప్రభుత్వాలు, కమిషన్లు గుర్తించాయని, వందలాది ఉత్తర్వులు, కమిషన్ల నివేదికలు ఉన్నాయని వివరించారు. వాటన్నింటినీ ప్రస్తుత ప్రభుత్వం విస్మరించి, వాటికి విరుద్ధంగా కులగణనలో విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ జాతీయులను విభజించి వివరాలను సేకరించిందని మండిపడ్డారు. రాష్ట్రంలో 20 లక్షల మందికి పైగా ఉన్నారని, తమను విభజించి తుది నివేదికను వెల్లడిస్తే ప్రభుత్వంపై ఉద్యమిస్తామని హెచ్చరించారు. హైకోర్టు ఆదేశాలను అమలు చేయకుంటే కోర్టులో సవాల్ చేస్తామని స్పష్టం చేశారు.
హైదరాబాద్, ఫిబ్రవరి7 (నమస్తే తెలంగాణ) : బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణకు సిఫారసులు చేసేందుకు ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్‌కు ప్రభుత్వం రూ. 60 లక్షలను మంజూరు చేసింది. న్యాయ నిపుణులు, రీసెర్చ్ స్కాలర్లు, ఇతర క్లిరకల్ ఉద్యోగుల నియామకానికి సంబంధించి జీతభత్యాలు, రవాణా అలవెన్స్‌లకు రూ. 60 లక్షలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.