TTD | హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ఆలయంలో ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ఈ నెల 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో భాగంగా 19న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నందున ఆ రోజు వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ కారణంగా 18న సిఫారసు లేఖలు స్వీకరించబోమని అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి 12.34 గంటలకు ధనుర్మాసం ప్రారంభం కానున్నందున టీటీడీ స్థానిక ఆలయాల్లో ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ధర్మప్రచారంలో భాగంగా వేద సారాన్ని ప్రజలకు తెలిపేందుకు 2024, ఫిబ్రవరి మొదటి వారంలో సహస్రపురుష వేదస్వస్తి చతుర్వేద పారాయణం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ జేఈవో సదాభార్గవి అధికారులను ఆదేశించారు.
తిరుమలను కమ్మేసిన పొగమంచు.. రాకపోకల నిలిపివేత
తిరుమలను పొగమంచు కమ్మేసింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి దట్టమైన పొగమంచు కారణంగా ఘాట్రోడ్లలో సొంత వాహనాల్లో ప్రయాణించే వారిని అలిపిరి వద్ద టీటీడీ సిబ్బంది అప్రమత్తం చేశారు. రహదారి మరమ్మతులు కొనసాగుతున్నచోట జాగ్రత్తగా వెళ్లాలని సూచిస్తున్నారు. పొగమంచు, వర్షం కారణంగా పాపవినాశనం, శ్రీవారి మెట్ల మార్గాలను తాత్కాలికంగా టీటీడీ మూసివేసింది. ఈ మార్గాల్లో వాహనాల రాకపోకలను శుక్రవారం సాయంత్రం నుంచి నిలిపివేశారు.