హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : బీటెక్ మేనేజ్మెంట్ కోటా (బీ-క్యాటగిరీ) సీట్ల భర్తీలో కాలేజీలు ఉల్లంఘనలకు పాల్పడ్డట్టుగా తెలంగాణ ఉన్నత విద్యామండలి గుర్తించింది. ఇష్టారీతిన సీట్లను భర్తీచేసిన 30 కాలేజీలకు షాకాజ్ నోటీసులిచ్చింది. సంబంధిత కాలేజీల సీట్ల ర్యాటిఫికేషన్(ఆమోదాన్ని) పెండింగ్‌లో పెట్టింది. కొన్ని కాలేజీలిచ్చిన వివరణలు సరిగ్గాలేకపోవడంతో రెండుసార్లు నోటీసులు జారీచేసింది. బీటెక్‌లో 30శాతం సీట్లను మేనేజ్మెంట్, 15 శాతం సీట్లను ఎన్నారై కోటాలో భర్తీచేసుకోవాలి. ఈ సీట్లను జేఈఈ మెయిన్ ర్యాంకుల ఆధారంగా భర్తీచేయాలి. మిగిలిన సీట్లను ఎప్‌సెట్ , ఇంటర్ మెరిట్ ఆధారంగా నింపుకోవచ్చు. ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతే ఆ సీట్లను భర్తీచేసుకోవాలి. కానీ కొన్ని కాలేజీలు నోటిఫికేషన్‌కు ముందే సీట్లను నింపేసుకున్నాయి. నిర్దేశిత ఫీజు కంటే ఎక్కువ మొత్తంలో వసూలు చేశాయి.
కాలేజీల ఉల్లంఘనలపై ఉన్నత విద్యామండలి కమిటీ వేసి విచారణ జరపగా, పలు విషయాలు బహిర్గతమయ్యాయి. ఆగస్టులో నోటిఫికేషన్ జారీచేయగా ఓ కాలేజీ మేలోనే ఓ విద్యార్థి నుంచి రూ. 2 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకుంది. మరో కాలేజీలోమెరిట్లేని విద్యార్థికి సీటు కేటాయించారు. అనేక ఉల్లంఘనలు జరిగినట్టుగా మండలి గుర్తించింది. విచారణ కమిటీ కొన్ని కాలేజీలకు మినహాయింపునివ్వగా, మరికొన్నిటి ర్యాటిఫికేషన్ పెండింగ్‌లో పెట్టింది. వా టి నుంచి వివరణ తీసుకోవాలని అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది.