హైదరాబాద్ : భారత దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న తెలంగాణ ప్రాంత పోరాట యోధుల చరిత్రను భావి తరాలకు అందించాల్సిన ఆవశ్యకత ఉందని, అందుకు ప్రత్యేకంగా పరిశోధకుల బృందాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఆదివారం సాలార్ జంగ్ మ్యూజియంలో ఇతిహాస్ సంకలన్ సమితి ఆధ్వర్యంలో జరిగిన ‘అన్ సంగ్ హీరోస్ ఆఫ్ ఫ్రీడం స్ట్రగుల్ ఫ్రేమ్ తెలంగాణ రీజియన్ (1857 -1948 )’ జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో అప్పటి హైదరాబాద్ ( తెలంగాణ ) ప్రాంతం నుంచి అనేక మంది వివరాలు వెలుగులోకి రాలేదని, అలాంటి తెలంగాణ ప్రాంత యోధుల నేపథ్యం వెలుగులోకి తీసుకుని రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. అప్పటి నైజాం ప్రభుత్వ కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన అరాచకాలపై ప్రజలు తిరగబడ్డారని, ఆ ప్రజలకు అండగా పోరాటాలు చేసిన అనేక మంది యోధుల చరిత్రను భావి తరాలకు అందించాలని ఆయన నిర్వాహకులకు సూచించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాలలో జరిగిన ఊచకోత ఉదంతం జలియన్ వాలాభాగ్ ఘటనకు ఏమాత్రం తీసిపోదన్నారు. విద్యార్థి రాజకీయాల పునాదుల నుంచి వచ్చిన వారు ప్రజా సేవలో చురుకైన పాత్రను పోషించే స్థాయిలో ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో సాలార్ జంగ్ మ్యూజియం డైరెక్టర్ నాగేందర్ రెడ్డి, నిర్వాహకులు ప్రొఫెసర్లు కిషన్ రావు, మనోహర్ రావు, వీరేందర్ తదితరులు పాల్గొన్నారు.