హైదరాబాద్, జులై 19 (నమస్తే తెలంగాణ)/సుల్తాన్‌బజార్: బ్యాంకుల ప్రైవేటీకరణను టీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని, కేంద్రం మొండి వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ స్పష్టంచేశారు. 53వ బ్యాంకుల జాతీయకరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గన్‌ఫౌండ్రీ పర్వానా హాల్లో మంగళవారం ‘బ్యాంకుల జాతీయకరణ- ఆర్థిక అభివృద్ధి’అంశంపై ఏపీ, టీఎస్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఏఐబీఈఏ)రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఫెడరేషన్ అధ్యక్షుడు టీ రవీంధ్రనాథ్ అధ్యక్షత జరిగిన సదస్సుకు వినోద్‌కుమార్ హాజరై, మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వరంగ బ్యాంకులు కీలకపాత్ర పోషిస్తున్నాయ ని, వాటిని ప్రైవేటీకరిస్తే ప్రజాసంక్షేమం ప్రమాదంలో పడుతుందని చెప్పారు. ప్రైవేట్వ్యక్తుల చేతుల్లో సంపద కేంద్రీకరణను నిరోధించేందుకు, దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి నిధులను సమీకరించడం కోసం, పరిశ్రమలు, వ్యవసాయానికి నిధులు సమకూర్చడం కోసమే.. ఆనాడు బ్యాంకుల జాతీయకరణ జరిగిందన్నారు.దేశంలో ప్రైవేటుబ్యాంకులు విఫలమయ్యాయని, ప్రజలు కోట్ల రూపాయల డిపాజిట్లను కోల్పోయారని తెలిపారు.
పార్లమెంట్ లోపల.. బయట ఆందోళన
దేశ ఆర్థికాభివృద్ధికి సహకరించేందుకు ఏ ప్రైవేట్ రంగ బ్యాంకు ముందుకు రాలేదని చెప్పారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు కోట్లాదిగా రుణాలు ఎగవేసింది ధనిక పారిశ్రామికవేత్తలేనని, వీరిపై కేంద్రం చర్యలు తీసుకోకుండా.. బ్యాంకులను ప్రైవేటీకరించడమే మిటని ప్రశ్నించారు. ప్రధాని తన కార్పొరేట్ మిత్రులు లూటీ చేసుకోవడానికే బ్యాంకులను ప్రైవేటీకరిస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రతిపాదనలను విరమించుకోవాలని పార్లమెంట్‌లోపల, బయ ట టీఆర్ఎస్ ఆందోళన చేపడుతుందని స్పష్టంచేశారు. సదస్సులో ఏఐబీఈఏ జాతీయ కార్యదర్శి రాంబాబు, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వీఎస్ బోస్ తదితరులు పాల్గొన్నారు.
విజన్ ఉన్న నేత కేసీఆర్
ప్రతి అంశాన్ని సూక్ష్మ దృష్టితో పరిశీలించడం, లోతుగా విశ్లేషించడం సీఎం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. కేసీఆర్‌తో ఉన్న 22 ఏండ్ల అనుబంధంలో తాను గమనించిన అంశాలు ఇవేనని పేరొన్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికా సంఘం (టీఎస్‌డీపీఎస్), అర్థగణాంక శాఖలు సంయుక్తంగా ఎంసీహెచ్చార్డీలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో వినోద్‌కుమార్ మాట్లాడుతూ..ప్రతి అంశంపై కేసీఆర్‌కు పకా విజన్ ఉంటుందన్నారు. ఆ విజన్‌తోనే రాష్ట్రం లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, ఆరోగ్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నదన్నారు. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి కే రామకృష్ణారావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. టీఎస్‌డీపీఎస్ సంస్థ ముద్రించిన వాల్‌పోస్టర్‌ను ఆవిషరించారు.