ఇప్పటికే 46.8% .. 2025 నాటికి 50%
వేరే రాష్ర్టాల కన్నా 25 ఏండ్లు ముందు
నీతి ఆయోగ్ తాజా నివేదికలో వెల్లడి
హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పట్టణీకరణ వేగంగా వృద్ధి చెందుతున్నది. దేశంలోని ఇతర రాష్ర్టాలతో పోల్చి చూస్తే తెలంగాణ పట్టణీకరణలో రెండున్నర దశాబ్దాలు ముందున్నది. 2025 నాటికి రాష్ట్రంలో పట్టణ జనాభా 50 శాతానికి చేరుకొనే అవకాశం ఉన్నట్టు నీతి ఆయోగ్ వెల్లడించింది. ప్రస్తుతం పట్టణ జనాభా జాతీయ సగ టు 31.16 శాతం కాగా, తెలంగాణలో 46.8 శాతంగా నమోదైందని నీతి ఆయోగ్ తాజా నివేదికలో తెలిపింది. నివేదిక ప్రకారం.. పట్టణీకరణలో తొలి రెండు స్థానాల్లో తమిళనాడు (48.4 శాతం), కేరళ (47.2) ఉండగా, తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర (45.23 శాతం) నాలుగో స్థానంలో ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిశీల పట్టణ విధానాలు, చొరవతో పట్టణ ప్రాంతాలు, పట్టణ జనాభా పెరగటానికి దోహదపడ్డాయి.
తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్ర ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థల సంఖ్యను 142కు పెంచి, మౌలిక సదుపాయాల కల్పనకు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టింది. ఫలితంగా పట్టణీకరణ పుంజుకొన్నది. ఆర్థిక కార్యకలాపాలు, విద్య, ఉపాధి అవకాశాలు, జీవన స్థితిగతులు పెరిగాయి. ప్ర స్తుతం రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలు మూడు శాతం కం టే తకువ భూభాగాన్ని కలిగినా, రాష్ట్ర జీడీపీలో అవి మూ డింట రెండు వంతుల వాటాను అందిస్తున్నాయి. ఆరేండ్లుగా ‘జీవన నాణ్యత సూచిక’లో దేశంలోనే అత్యుత్తమ నగరంగా హైదరాబాద్ గుర్తింపు పొందింది. కొనుగోలు శక్తి, భద్రత, ఆరోగ్య సంరక్షణ, జీవన వ్యయం, ఆస్తి ధర నుండి ఆదాయ నిష్పత్తి, ట్రాఫిక్ ప్రయాణ సమయ సూచికల్లో రాష్ట్ర రాజధాని అగ్రస్థానంలో ఉన్నది. ఈ నగరం నాణ్యత, ఆర్థిక పోటీతత్వా న్ని సాధించటానికి ప్రపంచంలోని 30 ప్రధాన నగరాల్లో ఒకటిగా నిలిచిందని నీతి ఆయోగ్ వెల్లడించింది. అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వ చిత్త శుద్ధికి ఇది నిదర్శనంగా నిలుస్తున్నది.