నిర్మల్, జూన్ 24(నమస్తే తెలంగాణ): అన్ని అర్హతలు ఉండి, ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ గృహజ్యోతి పథకం కింద తమకు విద్యుత్తు సబ్సిడీ అందడం లేదంటూ అర్హులందరూ ఆందోళన బాట పట్టారు. నిర్మల్ జిల్లాలోని నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన దాదాపు 150 మందికి పైగా గృహజ్యోతి పథకం అర్హులు కలెక్టర్‌ను కలిసి సోమవారం తమ గోడును వెల్లబోసుకున్నారు. దీంతో స్పందించిన కలెక్టర్.. అక్కడే ఉన్న విద్యుత్‌శాఖ డీఈ నాగరాజును పిలిచి వీరి సమస్యను పరిష్కరించాలని సూచించారు. కాగా, డీఈ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా, ఆయన తీరుపై కూడా గ్రామస్తులు మండిపడ్డారు.