వాజేడు, జూన్ 5: మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి మృతి చెందిన ఏసు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. బుధవారం ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెద్ద దిక్కును కోల్పోయిన ఏసు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకొని న్యాయం చేయాలని కోరారు. ‘మావోయిస్టుల పోరాటం అంటే అమాయక ప్రజలను చంపడమేనా’ అని ఈ సందర్భంగా గ్రామస్థులు ప్రశ్నించారు. కాగా.. ఏసు మృతి నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.
వెంకటాపురం సర్కిల్ పరిధిలోని తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైన కర్రెగుట్టల అడవుల్లో బాంబుస్కాడ్తో పోలీసు బృందాలు తనిఖీలు చేశాయి. బుధవారం మధ్యాహ్న సమయంలో చెలిమల గ్రామ సమీపంలోని అటవీప్రాంతంలో కాలిబాటల వెంబడి నిషేధిత మావోయిస్టులు అమర్చిన మందుపాతరను గుర్తించి నిర్వీర్యం చేసినట్టు ఎస్పీ డాక్టర్ శబరీష్ తెలిపారు.