BJP | హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): అభ్యర్థుల ఎంపికలోనే తీవ్ర తడబాటుకు గురైన బీజేపీ.. బీ ఫారాలు ఇచ్చే సమయంలోనూ ఆగమాగం అయ్యింది. ఒకవైపు చాలాచోట్ల సరైన అభ్యర్థులు దొరకక నామినేషన్ల చివరిరోజున జాబితాలు విడుదల చేసింది. మరోవైపు ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఎంపీ బండి సంజయ్ మధ్య ఆధిపత్య పోరు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అలక వంటి పరిణామాల నేపథ్యంలో చివరి నిమిషంలో అభ్యర్థులను మార్చింది. ఐదుగురు అభ్యర్థులకు ప్రకటించిన టికెట్లను నామినేషన్ల చివరి ఘట్టంలో తూచ్ అనేసింది. వేములవాడ టికెట్ కోసం చెన్నమనేని వికాస్‌రావు, తులా ఉమ పోటీపడ్డారు. వికాస్‌రావుకు బండి సంజయ్, తుల ఉమకు ఈటల అండగా నిలిచారు. తొలుత తుల ఉమకు టికెట్ కేటాయించారు. దీంతో వికాస్‌రావు అనుచరులు 3 రోజులపాటు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ధర్నా చేశారు.
ఈ నేపథ్యంలో తుల ఉమ నామినేషన్ వేసేందుకు వెళ్తున్న చివరిక్షణంలో టికెట్‌ను మార్చి వికాస్‌రావుకు బీ ఫారం అందజేశారు. దీంతో తుల ఉమ ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేశారు. తనను బీజేపీ మోసం చేసిందంటూ శాపనార్థాలు పెట్టారు. సంగారెడ్డి టికెట్‌ను బండి సంజయ్ ఒత్తిడి మేరకు తొలుత రాజేశ్వర్‌రావు దేశ్‌పాండేకు కేటాయించారు.
ఈటల ఒత్తిడి చేయడంతో అభ్యర్థిని మార్చి పులి మామిడిరాజును అభ్యర్థిగా ప్రకటించారు. భగ్గుమన్న రాజేశ్వర్‌రావు వర్గీయులు సంగారెడ్డి బీజేపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. వనపర్తి అసెంబ్లీ స్థానానికి ఆర్టీసీ జేఏసీ మాజీ చైర్మన్ అశ్వత్థామరెడ్డికి కేటాయిస్తూ బీజేపీ గతంలో నిర్ణయం తీసుకున్నది. కానీ చివరిరోజు అకస్మాత్తుగా ఆయనకు షాక్ ఇస్తూ.. అనుజ్ఞరెడ్డికి కేటాయించింది. బెల్లంపల్లిలో తొలుత మాజీ ఎమ్మెల్యే శ్రీదేవికి టికెట్ కేటాయించి.. ఆ తర్వాత కొయ్యల ఏమాజికి ఇచ్చింది. ఆ తర్వాత మళ్లీ శ్రీదేవినే అభ్యర్థిగా ప్రకటించి బీఫారం అందజేసింది. అలంపూర్‌లో తొలుత మేరమ్మను అభ్యర్థిగా ప్రకటించి, చివరికి రాజగోపాల్ పేరును ఖరారు చేసింది.
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో తాను చెప్పిన అభ్యర్థులకే టికెట్ ఇవ్వాలంటూ మొదటి నుంచీ పట్టుబడుతున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పంతాన్ని నెగ్గించుకున్నారు. ఆయన అనుచరులు తోకల శ్రీనివాస్‌రెడ్డికి రాజేంద్రనగర్, రవికుమార్‌యాదవ్‌కు శేరిలింగంపల్లి టికెట్‌ను ఖరారు చేసింది. శేరిలింగంపల్లిని జనసేన కోరగా, కొండా ససేమిరా అన్నారు. ఇదే స్థానం నుంచి బీజేపీ నేత యోగానంద్ కూడా పోటీ పడ్డారు. చివరికి కొండా తన పంతం నెగ్గించుకున్నారు. చివరి నిమిషం వరకు పొడిగించి ప్రజలకు, కార్యకర్తలకు అసహనం తెప్పించిన బీజేపీ.. చివరి రోజు డ్రామాతో పరువును మరింత పోగొట్టుకున్నది.