హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : సామాజిక న్యాయాన్ని నినాదంగా కాకుండా ఆచరించి చూపిస్తున్న సీఎం కేసీఆర్ సర్కారు మరో కీలక పదవిని దళిత ప్రొఫెసర్‌కు అప్పగించింది. రాష్ట్ర తొలి మహిళా వర్సిటీ వైస్‌చాన్స్‌లర్ (వీసీ)గా దళిత ప్రొఫెసర్ విజ్జులతను నియమించింది. సోమవారం హైదరాబాద్ కోఠిలోని వర్సిటీ ప్రాంగణంలో వర్సిటీ ఇన్చార్జి వీసీగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఆమె వెంట ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మన్ వెంకటరమణ, ఉస్మానియా వర్సిటీ వీసీ డీ రవీందర్ తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో మహిళా విద్య, సాధికారతకు కృషిచేయడంలో భాగంగా ప్రభుత్వం కోఠి మహిళా కాలేజీని యూనివర్సిటీగా అప్గ్రేడ్చేసిన విషయం తెలిసింది. గత ఏడాదే ఈ వర్సిటీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ విజ్జులత ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.
విద్యారంగంలో బడుగులకు రాష్ట్ర ప్రభుత్వం సుముచితస్థానం కల్పిస్తున్నది. దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రొఫెసర్ ఆర్ లింబాద్రిని ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా నియమించింది. ఈ పదవిని ఉమ్మడి రాష్ట్రంలో ఏ ఒక్క దళితుడిని ఇవ్వలేదు. దళిత వర్గానికే చెందిన మరో ప్రొఫెసర్ ఎస్ మల్లేశ్‌ను శాతవాహన వర్సిటీ వీసీగా, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్‌ను పాలమూరు వర్సిటీ వీసీగా నియమించింది. ఓయూ వీసీగా బీసీ వర్గానికి చెందిన రవీందర్‌యాదవ్, తాటికొండ రమేశ్‌ను కేయూ వీసీగా అవకాశానిచ్చింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రొఫెసర్ వెంకటరమణ ఉన్నత విద్యామండలి వైస్‌చైర్మన్‌గా, ఆర్జేయూటీకే ఇన్చార్జి వీసీగాను వ్యవహరిస్తున్నారు.
మా నాన్న రామేశ్వర్రావు నగరంలోని మెట్రోలో సాధారణ టైలర్‌గా పనిచేసేవారు. మా అమ్మ పారిజాత అప్పట్లో పీయూసీ వరకు చదువుకొన్నది. మాది దళిత కుటుంబం. మా ఇంట్లో ఈ స్థాయికి చేరుకొన్నది నేనే. చదువు విషయమై మా అమ్మ నన్నెంతో ప్రోత్సహించేవారు. పాఠశాల విద్యను రాంనగర్ సెయింట్ పాయిస్ స్కూళ్లో, ఇంటర్ స్లాన్లీ కాలేజీ, డిగ్రీ కోఠి మహిళా కాలేజీలో, పీజీ, పీహెచ్డీ హెచ్‌సీయూలో పూర్తిచేశా. పీహెచ్డీ పూర్తికాగానే ఉస్మానియా వర్సిటీలో ఉద్యోగంలో చేరా. నేను ఈ స్థాయికి చేరేందుకు హెచ్‌సీయూ వాతావరణం కూడా దోహదపడింది. ప్రిన్సిపాల్‌గా అదే కాలేజీలో పనిచేసి, ఇప్పుడు ఇన్చార్జి వైస్‌చాన్స్‌లర్ కావడం అత్యంత సంతోషదాయకం.
మహిళా వర్సిటీ కొత్త భవనానికి 10 రోజుల్లో భూమిపూజ చేస్తాం. దీనికి సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించాము. జీ ప్లస్ 9 అంతస్తుల్లో తరగతి గదులు, మరో జీ ప్లస్ 9 అంతస్థుల్లో హాస్టల్ భవనం కాంప్లెక్స్‌ను నిర్మిస్తాం. ఇందుకు రూ. 95 కోట్ల నుంచి 100 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. వర్సిటీలో ఇంక్యుబేషన్, అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్‌ను ఏర్పాటు చేయబోతున్నాం. టీ హబ్, తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ సహకారాన్ని తీసుకొని మహిళా విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా, శాస్త్రవేత్తలుగా తయారుచేస్తాం. స్టార్టప్‌లను ప్రోత్సహిస్తాం.
రాష్ట్రంలోని మహిళా డిగ్రీ, పీజీ కాలేజీలు త్వరలోనే మా వర్సిటీ పరిధిలోకే వస్తాయి. రెగ్యులర్ వర్సిటీల్లో ఉన్నట్టుగానే అనుబంధ ప్రైవేట్ కాలేజీలకు ఇంజినీరింగ్, వృత్తి విద్యా కాలేజీలకు కూడా అనుమతులిస్తాం. గురుకుల మహిళా డిగ్రీ, పీజీ వృత్తి విద్యాకాలేజీలను మహిళా వర్సిటీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ఉన్నత విద్యామండలి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇదంతా జరిగేందుకు మూడు, నాలుగేండ్లు పడుతుంది. సెయింట్ ఆన్స్ తదితర మహిళా కాలేజీలు మా పరిధిలోకి వచ్చేందుకు ఉత్సాహం చూపుతున్నాయి.
2024 -25విద్యా సంవత్సరం నుంచి కొత్తగా బీటెక్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్‌సైన్స్, బీఈడీ ఎంఈడీ, బీపీఈడీ, బ్యూటీషియన్, కుకింగ్ వంటి కోర్సులను అందుబాటులోకి తెస్తాం. మార్కెట్ అవసరాలను బట్టి కొత్త కోర్సులను విడతల వారీగా ప్రవేశపెడుతాం. ప్రస్తుతానికి వర్సిటీ ఇక్కడే కొనసాగుతున్నది. అవసరాన్ని బట్టి ఇతర ప్రాంతాల్లో స్థలాన్ని కేటాయిస్తే కొన్ని కోర్సులతో కూడిన ఫీడర్ క్యాంపస్‌లను నిర్వహించే ఆలోచన చేస్తున్నాం.
నిబద్ధత, కష్టపడే తత్వం ఉంటే మహిళలు ఎక్కడైనా రాణించగలరు. లక్ష్యాన్ని చేరుకొనేందుకు సులభమైన దారులంటూ ఏమి ఉండవు. ప్రతిదానిని సవాల్‌గా తీసుకొని..సంఘర్షణను ఎదుర్కొంటేనే సమాజంలో నిలదొక్కుకోగలం. సత్తా ఉంటేనే అవకాశాలొస్తాయి. అ సత్తాను మహిళలు సమకూర్చుకోవాలి.
తొలి మహిళా వర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌గా దళిత ప్రొఫెసర్ విజ్జుల్లతను నియమించడం శుభసూచకమని ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి పేర్కొన్నారు. ఇందుకు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, సబితాఇంద్రారెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.విజ్జులత బాధ్యతలు స్వీకరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గురుకులాలతో ప్రాథమిక స్థాయి నుంచి బాలికల విద్యకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. ఉన్నత విద్య కోసం తాజాగా మహిళా వర్సిటీని ఏర్పాటుచేసిన సీఎం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనమని కొనియాడారు. ఉన్నత విద్యలో తెలంగాణ అద్భుతాలు సృష్టిస్తున్నదని చెప్పారు.