ఖైరతాబాద్, మే 31: ఓసీల్లోని పేదల తరఫున మాట్లాడిన ఏకైక నేత కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిపై దాడి హేయమని ఓసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిమర్ల విజేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 29న జరిగిన రెడ్ల సింహగర్జన కార్యక్రమానికి నిర్వాహకుల ఆహ్వానం మేరకే ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి వచ్చారని చెప్పారు. ఓసీ వర్గాలకు న్యాయం చేయాలన్న సదుద్దేశంతోనే మంత్రి మాట్లాడారని గుర్తుచేశారు. ఓసీల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరిస్తూ.. కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి వస్తే కొందరు రాజకీయ దురుద్దేశంతో దాడి చేయడంపై మండిపడ్డారు. ఓసీ, రెడ్ల కార్పొరేషన్ అంశాన్ని రాజకీయం చేస్తూ కొందరు తమ లబ్ధికోసం వాడుకొంటున్నారని ఆరోపించారు. మంత్రి మల్లారెడ్డితోనే కార్పొరేషన్ ఏర్పాటు సాధ్యమవుతుందని, తమ సమస్యలను నేరుగా సీఎం కేసీఆర్‌కు వివరించే సత్తా ఆయనకే ఉన్నదని చెప్పారు. కార్యక్రమ నిర్వాహకులు తక్షణమే మంత్రికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రెడ్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే తమ సంపూర్ణ మద్దతు టీఆర్ఎస్కేనని స్పష్టంచేశారు. సమావేశంలో ఓసీ సంక్షేమ సంఘం నాయకులు సుదిని అంకిరెడ్డి, తుమ్మల శేఖర్‌రెడ్డి, ఎస్ లహరిరెడ్డి, హేమంత్‌రెడ్డి, తరుణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.