హైదరాబాద్ : మాజీ మంత్రి, సీబీఐ మాజీ డైరెక్టర్ విజయ రామారావు (Vijaya Ramarao) అంత్యక్రియలు (Funeral) బుధవారం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ మహా ప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి. అంత్యక్రియలకు ముందు గౌరవ సూచకంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి, గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా పోలీసులు విజయరామారావు గారి పార్థివ దేహం వద్ద పుష్ప గుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Miniter Errabelli) వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. విజయ రామారావు ఆత్మకు సద్గతులు కలగాలని కోరుతూ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా విజయరామారావు తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. విజయ రామారావు నిజాయితీగల అధికారని, మంచి పరిపాలన దక్షుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి ప్రకాశ్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి, దైవజ్ఞ శర్మ, వారి కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు.