హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. విచారణకు క్యాబినెట్లో తీర్మా నించి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిం ది. తాజాగా రాష్ట్ర విజిలెన్స్ విభాగం అధికారులు మంగళవారం ఆకస్మికంగా రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు జరిపి పలు ఫైళ్లను తీసుకెళ్లారు.
30 మంది బృందం
రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు మంగళవారం ఉదయం 10.30 గంటలకే ఎర్రమంజిల్‌లోని రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసులు, ఈఈ స్థాయి ఇంజినీర్లు, ఇతర విభాగాల నిపుణులతో కూడిన 30 మంది అధికారుల బృం దం సెర్చ్ వారెంట్‌తో తరలివచ్చి సోదాలను నిర్వహించింది. విజిలెన్స్ బృందం కార్యాలయంలోకి రాగానే జలసౌధ భవనాన్ని స్వాధీనం చేసుకొన్న ది. ఉద్యోగులు, ఇతరుల రాకపోకలను నిలిపేసిం ది. కాళేశ్వరం కార్పొరేషన్ కార్యాలయం, ఈఎన్సీ మురళీధర్, డిప్యూటీ ఈఎన్సీ, పీఅండ్ఎం ఎస్ఈ, రామగుండం ఈఎన్సీ, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్(సీడీవో) కార్యాలయాలను పూర్తిగా స్వాధీనం చేసుకొన్నది.
అనంతరం ఈఎన్సీ మురళీధర్, అధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చించింది. కాళేశ్వరంలో నిర్మించిన 3 బరాజ్‌లు, ఇత ర నిర్మాణాల డిజైన్లు, ప్రాజెక్టు టెండర్ ఫైళ్లు, సాం కేతిక, ఆర్థికాంశాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించి ఫైళ్లన్నింటినీ జిరాక్స్ తీసుకుని సాయం త్రం 6 గంటల తరువాత జలసౌధ నుంచి వెళ్లిపోయారు. దాదాపు 7గంటల పాటు సోదాలు కొనసాగాయి. ఫైళ్లు, కంప్యూటర్ల హర్డ్ డిస్క్‌లను స్వా ధీనం చేసుకున్నట్టు తెలుస్తున్నది.
ఏకకాలంలో 12 చోట్ల
జలసౌధతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 12 చోట్ల ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ ఎస్పీ రమణారెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్లో, అదనపు ఎస్పీ బాలకోటయ్య ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలోని కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ మురళీధర్‌రావు క్యాంపు కార్యాలయంలో ఉదయం 11:30 గంటలకు విజిలెన్స్ ఎస్పీ రమణారెడ్డి ఆధ్వర్యంలో డీఎస్పీ శ్రీనివాస్‌రావు, సీఐలు నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రావు, ఎస్ఐ నారాయణబాబు, నీటి పారుదలశాఖ విజిలెన్స్ డీఈ శ్రీనివాస్, ఏఈ శశిధర్ నేతృత్వంలో రాత్రి 7 గంటలకు సో దాలు నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఎన్టీపీసీలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన 3 కార్యాలయాల్లో విజిలెన్స్ అదనపు ఎస్పీ బాలకోటయ్య ఆధ్వర్యంలో మూడు బృందాలు ఒకే సమయంలో తనిఖీలు జరిపాయి. భీమునిపట్నం, చిలుకలయ్యగుడి ప్రాంతంలోని నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ కార్యాలయంలో బాలకోటయ్య తనిఖీలు నిర్వహించగా, కృష్ణానగర్‌లోని ఇంజినీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో విజిలెన్స్ డీఎస్పీ కమలాకర్‌రెడ్డి, ఎఫ్‌సీఐ క్రాస్‌రోడ్‌లోని కార్యనిర్వాహక ఇంజినీర్ నాణ్యత నియంత్రణ తనిఖీ కార్యాలయంలో విజిలెన్సీ సీఐ జీసీ రాజు తనిఖీల్లో పాల్గొన్నారు.
విజిలెన్స్ ఎస్పీ శ్రీరామోజు రమేశ్ ఆధ్వర్యంలో నలుగురు డీఎస్పీల బృందం, మరో పదిమంది ఇంజినీర్ల బృందం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించాయి. తొలుత మహదేవ్‌పూర్‌లోని ఇరిగేషన్ డివిజన్ కార్యాలయాల్లో, విజిలెన్స్, ఇంజినీర్ల బృందాలు కన్నెపల్లి పంప్‌హౌస్, అన్నారం, మేడిగడ్డ బరాజ్‌ల వద్ద కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. బుధవారం కూడా విజిలెన్స్ తనిఖీ కొనసాగనున్నట్టు తెలుస్తున్నది. విజిలెన్స్ ఎస్పీ రమణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు రికార్డులు పరిశీలిస్తున్నామని తెలిపారు. కేవలం ఫైల్స్ మాత్రమే స్వాధీనం చేసుకుంటున్నామని వివరించారు. అధికారులు చక్కగా సహకరిస్తున్నారని, బుధవారమూ కొనసాగుతుందని వెల్లడించారు.
విచారణకు లేఖ రాశాం: మంత్రి ఉత్తమ్
మేడిగడ్డ బరాజ్ పిల్లర్లు కుంగిపోవడంపై విచారణ చేపట్టాలని విజిలెన్స్ విభాగాన్ని ఆదేశించామని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగానే మేడిగడ్డ నుంచి హైదరాబాద్ వరకు ఉన్న పలు నీటి పారుదల కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారని స్పష్టం చేశారు. మేడిగడ్డ బరాజ్ పిల్లర్ల కుంగుబాటు అంశాన్ని తమ ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తున్నదని, ఇప్పటికే ప్రాజెక్టుపై పూర్తి సమాచారంతో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చామని తెలిపారు. తదుపరి చర్యల్లో సిట్టింగ్ న్యాయమూర్తితో జ్యుడీషియల్ విచారణ చేపట్టాలని నిర్ణయించామని చెప్పారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశామని పేర్కొన్నారు.
నేడు సీఎం సమీక్ష..
సాగునీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించనున్నారని సమాచారం. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, వాటి పురోగతి, యాసంగి సీజన్‌కు నీటి విడుదల తదితర అంశాలపై సమీక్ష నిర్వహించాలని గతంలోనే నిర్ణయించినా ప్రజాపాలన దరఖాస్తులపై, క్యాబినెట్ సమావేశం నేపథ్యంలో వాయిదా వేశారు. దాన్ని బుధవారం నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. విజిలెన్స్ సోదాల మరుసటి రోజునే ఇరిగేషన్‌శాఖపై సమావేశం నిర్వహిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకున్నది.