హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగా ణ): అక్రమ దత్తత పేరిట ప్రభుత్వ సంరక్షణలోకి తీసుకున్న చిన్నారుల విషయంలో అధికారులు అనుసరిస్తున్న విధానంపై హైకోర్టు కీలక ప్రశ్నలు లేవనెత్తింది. ఇలాంటి కేసుల్లో ప్రభుత్వం ఎంతమందిని సంరక్షణలోకి తీసుకున్నది? ప్రస్తుతం వారు ఎకడ ఉన్నారు? వారి తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యుల ఆ చూకీ ఏంది? ఆ పిల్లల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర సర్కార్ను ఆదేశించింది.
సూర్యాపేటలో అక్రమ దత్తతకు సంబంధించిన 9 మంది చిన్నారులను అధికారులు గుర్తించినప్పటికీ వారి తల్లిదండ్రుల వివరాలను తెలుసుకునే ప్రక్రియ పూర్తిస్థాయిలో చేపట్టకపోవడం పై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. 2023లో నల్లగొండ జిల్లా సూ రారం మండలంలో ఎం వెంకన్న దంపతులపై చిన్నారి సహజను అక్రమ దత్తత ఆరోపణల నేపథ్యంలో పోలీసులు మహిళా-శిశు సంక్షేమశాఖకు అప్పగించారు. దీన్ని సమర్థిస్తూ సింగి ల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై వెంకన్న దంపతులు అ ప్పీల్ దాఖలు చేశారు.
సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాస నం.. సూర్యాపేటలో 9మంది చిన్నారులను దత్తతకు అందుబాటులో ఉన్న పిల్లలుగా అధికారులు నమోదు చేయడాన్ని పరిశీలించింది. సహజ తల్లిదండ్రులు అందుబాటులో లేరని, ఆ చిన్నారిని సంరక్షిస్తున్న కుటుంబం కూడా లేదని నిర్ధారించిన తర్వాతే దత్తతకు అందుబాటులో ఉన్నట్టు నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఆ ప్రక్రియను పూర్తిగా పాటించకుండానే పిల్లల పేర్లను దత్తతకు అందుబాటులో ఉన్నవారిగా నమోదు చేయడం సరైన విధా నం కాదని పేరొన్నది.
మహారాష్ట్రలో పిల్లల అక్రమ రవాణాను అరికట్టడంతోపాటు అదృశ్యమైన చిన్నారులను గుర్తించేందుకు గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన వ్యవస్థ గురించి ధర్మాసనం ప్రస్తావించింది. అకడ అంగన్వాడీ, పాఠశాల సిబ్బంది భాగస్వామ్యంతో 27 వేల గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేశారని తెలిపింది. పిల్లల కదలికలు, అనుమానాస్పద దత్తతలను గ్రామస్థాయిలోనే గుర్తించేందుకు ఈ కమిటీలు ఉపయోగపడుతాయని పేర్కొంటూ.. ఇదే తరహా విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేసే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి సూచించింది.
రాష్ట్రంలో చట్టవిరుద్ధంగా పిల్లలను దత్తత తీసుకున్నట్టు అనుమానిస్తున్న వ్యక్తుల నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్న చిన్నారులతోపాటు ప్రస్తుతం బాలల సంరక్షణ గృహాల్లో ఉన్న పిల్లల సంఖ్య, వారి కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రుల ఆచూకీ, దత్తతకు సంబంధించిన ప్రస్తుత స్థితి తదితర వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. చిన్నారులున్న పేద కుటుంబాలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలను కూడా ఆ నివేదికలో పొందుపర్చాలని ధర్మాసనం స్పష్టం చేస్తూ.. తదుపరి విచారణను సెప్టెంబర్ 2కు వాయిదా వేసింది.