 
                                                            హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): నిత్యం అప్రమత్తతతో ఉండటం జీవితంలో భాగం కావాలని విజిలెన్స్ డీసీ శిఖాగోయల్ చెప్పారు. గురువారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో జరిగిన విజిలెన్స్ వారోత్సవాల్లో ఆమె మాట్లాడుతూ విజిలెన్స్ వారోత్సవాలను కేవలం ఏడురోజులకే పరిమితం చేయకుండా అన్ని రోజుల్లోనూ నిబద్ధతతో పనిచేయాలని అధికారులకు సూచించారు. నీతి, నిజాయతీ, పారదర్శకతతో పనిచేయాలని తెలిపారు.
నిజాయతీతో పనిచేయడంతోనే ఢిల్లీ మెట్రో రైలును సకాలంలో, తక్కువ ఖర్చుతో పూర్తిచేసినట్టు శ్రీధరన్ నిరూపించారని గుర్తుచేశారు. సింగరేణి సంస్థ ఇప్పటివరకు సాధించిన విజయాలను సీఎండీ బలరాం వివరించారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు సూర్యనారాయణ, కే వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
 
                            