మంచిర్యాల, మే 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అన్ని కులాల వారికి వేదాలు నేర్పిస్తానంటూ బాసరకు వచ్చిన వేదవిద్యానందగిరి అనే ఆంధ్రా సాములోరి ఆశ్రమం వరుస వివాదాలకు కేంద్రంగా మారింది. వేద పాఠశాలలో ఓ విద్యార్థి తీవ్రగాయాలతో ప్రాణాపాయస్థితికి చేరడం, ఆ కేసులో సాక్షిగా ఉన్న విద్యార్థి అనుమానాస్పదంగా చనిపోవడం ఇటీవల సంచలనంగా మారింది. బాధిత విద్యార్థుల కుటుంబ సభ్యులు స్వామిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పుష్కరఘాట్ కబ్జా, బీజాక్షరాల పేరుతో దందాపై వరుస వార్తా కథనాలు వెలువడ్డాయి. సాములోరి లీలలపై ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. కమిటీ విచారణ జరుగుతుండగానే వేదవిద్యానందగిరి ప్రధాన అనుచరుడు నూకం రామారావు ఈనెల 14న రాత్రి బాసర ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్‌కుమార్ పూజారిపై దాడి చేశారనే విషయం బయటకు వచ్చింది. స్వామిజీ ఆదేశిస్తే చంపేస్తానని తనను హెచ్చరించారని, బాసర పోలీసులకు సంజీవ్‌కుమార్ ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా జీడీలో ఎంట్రీ చేశారు.
మరుసటిరోజు అర్చకుడు సంజీవ్‌కుమార్‌పై పోలీసులకు రామారావు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ముందురోజు తాను ఇచ్చిన ఫిర్యాదుకు బదులుగా పోలీసులు ఇష్టమొచ్చినట్టుగా ఫిర్యాదు రాసుకున్నారని సంజీవ్‌కుమార్ చెప్తున్నారు. ఫిర్యాదును, సెక్షన్లను మార్చారని తెలిపారు. తలపై దాడి చేశారని, బూతులు తిట్టారని, చంపేస్తానంటూ బెదిరించారని తాను ఫిర్యాదులో పేర్కొంటే.. ఆ వివరాలు లేకుండా పోలీసులు ఫిర్యాదును రాసుకున్నారని చెప్పారు.
పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చిన మరుసటి రోజు గురువారం పూజారిపై దాడి చేసిన రామారావు ప్రెస్‌మీట్ పెట్టారు. సంజీవ్‌తో వాగ్వాదం జరిగిందని, దాడి చేయలేదని చెప్పుకొచ్చారు. ఓ సీసీటీవీ పుటేజీని విడుదల చేశారు. ప్రెస్‌మీట్ జరిగిన కాసేపటికే స్థానికులు వాట్సాప్ గ్రూపుల్లో సీసీటీవీ దృశ్యాలు విడుదల చేశారు. అర్చకుడు సంజీవ్‌తో రామారావు గొడవ పడటం, దాడి చేయడం ఆ వీడియోలో కనిపిస్తున్నది. ఈ దృశ్యాలను పోలీసులు పట్టించుకోవడం లేదని సంజీవ్ చెప్తున్నారు.
దాడికి గురైన అర్చకుడు సంజీవ్‌ను పోలీసులు తహశీల్దార్ ముందు బైండోవర్ చేశారు. రామారావు, సాములోరిపై చర్యలు తీసుకోకుండా తనపై ఉల్టా కేసు పెట్టడంలో ఆంతర్యమేంటో అర్థం కావడంలేదని సంజీవ్ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పూజారి ఇచ్చిన ఫిర్యాదు చాలా పెద్దగా ఉందని, అందుకే అతడి సమక్షంలో చిన్నగా రాసి, సంతకం తీసుకున్నామని ఎస్సై శ్రావణి చెప్తున్నారు.