కలెక్టరేట్, మే 30: జాతీయ ఉపాధిహామీ పథకంలో ప్రవేశపెట్టిన ఫేస్ రికైగ్నేషన్ యాప్ విధానంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామానికి చెందిన ఉపాధి కూలీ మహ్మద్ అజీమొద్దీన్ గుండు చేయించుకోగా, యాప్ అతడి ముఖాన్ని గుర్తించలేదు. పలుమార్లు ప్రయత్నించినా ఫొటో క్యాప్చరింగ్ కాకపోవడంతో చివరకు అతడి భార్య అబేదాబేగం జుట్టును గుండుపై ఉంచడంతో యాప్ ధ్రువీకరించింది. అయితే ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అదేవిధంగా 60 ఏండ్లు దాటిన కూలీల ఫొటోలు కూడా యాప్ అంగీకరించకపోవడంతో ఉపాధి పనులకు వస్తున్న కూలీలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పనులు చేసినా హాజరు నమోదుకాక కూలీ డబ్బులు కోల్పోయే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.