హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): ఆపరేషన్ ‘సిందూర్’తో మన శత్రువుపై ఘన విజయం సాధించామని, సాయుధ దళాల అసాధారణ సమన్వయం వల్లే ఈ విజయం సిద్ధించిందని భారత వైమానిక దళ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లోని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో 254 మంది క్యాడెట్లకు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ (సీజీపీ) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ సింగ్.. ఐఏఎఫ్ గ్రాడ్యుయేట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ ‘సిందూర్’ మన పరాక్రమానికి నిదర్శనంగా నిలిచిందని, ఒక్క ఆపరేషన్‌తోనే శత్రువును కోలుకోలేని దెబ్బ తీశామని, దీని ద్వారా భారత వైమానిక దళం సత్తా ప్రపంచానికి తెలిసిందని చెప్పారు. పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొన్నవారిలో 254 ఫ్లైట్ క్యాడెట్లు పట్టభద్రులయ్యారు.
భారత నౌకాదళానికి చెందిన 9 మంది అధికారులు, తీర రక్షణ దళానికి చెందిన 7 మంది అధికారులు, మిత్రదేశానికి చెందిన ఓ ట్రెయినీ విజయవంతంగా ఫ్లయింగ్ శిక్షణ పూర్తిచేయడంతో వారికి ‘వింగ్స్’ ప్రదానం చేశారు. శిక్షణ సందర్భంగా వివిధ విభాగాల్లో అద్భుత ప్రతిభ కనబర్చిన అధికారులను అభినందించారు. ఫ్లయింగ్ బ్రాంచ్‌కు చెందిన ఫ్లయింగ్ ఆఫీసర్ రోహన్ కృష్ణమూర్తికి రాష్ట్రపతి ప్లాక్, చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ స్వోర్డ్ ఆఫ్ హానర్ లభించాయి. గ్రౌండ్ డ్యూటీ విభాగాల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఫ్లయింగ్ ఆఫీసర్ నిష్ఠా వైద్‌కు రాష్ట్రపతి ప్లాక్ లభించింది. పరేడ్ సందర్భంగా ఆకాశ్ గంగా సై డైవింగ్ టీమ్, ఎయిర్ వారియర్ డ్రిల్ టీమ్, సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ అద్భుత విన్యాసాలతో అలరించాయి. పిలాటస్ పీసీ-7 ఎంకే-II, హాక్, కిరణ్ ఎంకే-I, చేతక్ తదితర శిక్షణ విమానాల ప్రదర్శన ఆకట్టుకున్నది. కార్యక్రమంలో ఎయిర్ మార్షల్ తేజీందర్ సింగ్, ఏఎఫ్ఏ కమాండెంట్ ఎయిర్ మార్షల్ పీకే వోహ్రా, పలువురు ఉన్నతాధికారులు, త్రివిధ దళాల అధికారులు, పట్టభద్రుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు.