NHRC | కొడంగల్, నవంబర్ 23 : ‘బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తాం. ఎవరూ భయపడొద్దు. స్వేచ్ఛగా జీవించాలి’ అని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ లా ముకేశ్ భరోసా ఇచ్చారు. భూసేకరణ ప్రభుత్వ నిబంధనలకు లోబడి మాత్రమే జరుగుతుందని, ఎవరూ భయపడొద్దని భరోసా ఇచ్చారు. యూనిఫామ్ ఉన్నదని ప్రజలపై అధికారాన్ని చలాయించొద్దని, వారిని భయాందోళనకు గురిచేయొద్దని పోలీసులకు సూచించారు. ఇకనుంచి పోలీసులు గ్రామాలకు రారని చెప్పారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం రోటిబండతండాలో శనివారం ఆయన బాధిత కుటుంబాలను కలిశారు. ఈ నెల 11న జరిగిన ఘటన, అనంతర పరిణామాలు, ప్రస్తుత పరిస్థితులను అడిగి వివరాలను నమోదు చే సుకున్నారు. లగచర్ల ఘటనపై బాధిత కుటుంబా లు, రైతుల ఫిర్యాదు మేరకు తాము ఢిల్లీ నుంచి వ చ్చినట్టు తెలిపారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. బాధితుల నుంచి సేకరించిన వివరాలను ప్రభుత్వ దృష్టికి తీకెళ్తామని చెప్పారు. ఆయన వెంట ఎన్హెచ్ఆర్సీ ఇన్స్పెక్టర్లు రోహిత్ సింగ్, యతీప్రకాశ్శర్మ ఉన్నారు. అధికారులపై దాడిలో నిందితులుగా ఉన్నవారు పోలీసులకు లొంగిపోతే అందరికీ బెయిల్ మంజూరయ్యే అవకాశం ఉంటుందని సూచించారు.
‘పోలీసులు మగవారు లేని ఇండ్లలోకి చొరబడి మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించారు. కరెంటు తీసేసి ఊరులోపలికి వచ్చి దాడి చేశారు. మా భర్తలు, కొడుకులు ఆ రోజు నుంచి కనిపించడం లేదు. వారు కనిపిస్తలేరని పోలీసులకు ఫిర్యాదు చేద్దామంటే మమ్మల్ని కూడా అరెస్టు చేస్తరేమోనని భయమైతున్నది. అప్పటినుంచి బిక్కుబిక్కుమనుకుంట తండాలల్లనే బతుకుతున్నం. 12 రోజుల నుంచి భయంభయంతోనే కాలం ఎల్లదీస్తున్నం. ఎప్పుడు ఎవరు వస్తరో.. ఏం జరుగుతందో తెల్వక తిండి, నిద్ర లేకుండ పాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నం. పొలాలకు పోతలేము. వరి, కంది పంటలు చేతికొచ్చినయి. వాటిని కోయకుంటే గింజలు నేలరాలుతయ్’ అంటూ లగచర్ల, దాని చుట్టుపక్కల తండాల ప్రజలు ఎన్హెచ్ఆర్సీ సభ్యుల ముందు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ నెల 11న అర్ధరాత్రి పోలీసులు సృష్టించిన బీభత్సంపై విచారణ జరిపేందుకు ఎన్హెచ్ఆర్సీ బృందం శనివారం రోటిబండతండాను సందర్శించింది. లగచర్లకు చెందిన ఫార్మా బాధిత రైతులు ఇటీవల ఢిల్లీ వెళ్లి తమకు న్యాయం చేయాలని ఎన్హెచ్ఆర్సీని కోరిన సంగతి తెలిసిందే.
ఈ నెల 11న ఉదయం దుద్యాల మండలంలోని హకీంపేట-దుద్యాల గ్రామాల మధ్యలో అధికారులు ఫార్మావిలేజ్ ఏర్పాటులో భాగంగా భూసేకరణ కోసం మీటింగ్ ఏర్పాటు చేశారని.. తమకు భూములిచ్చే ఉద్దేశం లేకపోవడంతో రైతులందరం లగచర్ల గ్రామంలోనే ఉన్నామని బాధితులు ఎన్హెచ్ఆర్సీ బృందంతో చెప్పారు. కాగా కలెక్టర్ ఎటువంటి సమాచారం లేకుండా లగచర్లకు వచ్చారని, తామంతా ఫార్మా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశామని తెలిపారు. వచ్చింది కలెక్టర్ అని తమకు తెలియదని, అధికారులు కావొచ్చని వారితో మాట్లాడుతున్న క్రమంలో తోపులాట జరిగిందని వివరించారు. ఇది కావాలని చేసింది కాదని చెప్పారు. కానీ ఆ ఘటనను కావాలనే దాడిగా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన రోజు తీసిన వీడియోల ఆధారంగా 300 మంది పోలీసులు అర్ధరాత్రి లైట్లు తీసేసి రోటిబండతండాలో ఉన్న పురుషులను వ్యా న్లలో ఎక్కించారని.. మగవారు లేని ఇండ్లలో మహిళలతో దురుసుగా ప్రవర్తించారని, ఫార్మావిలేజ్కి భూములిచ్చే ప్రసక్తి లేదని వారు స్పష్టంచేశారు.
దాడిలో తాము పేర్కొన్న నిందితుల్లో కొంతమంది పరారీలో ఉన్నారని, వారందరూ వచ్చి స్వచ్ఛందంగా పోలీసుల ముందు కానీ, కోర్టులో గానీ లొంగిపోతే అందరికీ బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందని పోలీసులు తండాల్లోని మహిళలకు అవగాహన కల్పించారు. జాబితాలో ఉన్న వారంతా లొంగిపోతేనే అరెస్టయిన వారికి కూడా బెయిల్ మంజూరు చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. బెయిల్ మంజూరుకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి కోర్టులో ఫ్రీ లీగల్ సర్వేసెస్ విభాగం ఉంటుందని, దానిని ఆశ్రయించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, డీటీడబ్ల్యూ కమాలాకర్‌రెడ్డి, దుద్యాల తాసీల్దార్ కిషన్ పాల్గొన్నారు.
ప్రస్తుతం ఈ ప్రాంతంలో రూ.70లక్షల నుంచి కోటి వరకు భూముల ధరలు పలుకుతున్నాయని, ప్రభుత్వం ఇచ్చే రూ.20 లక్షలతో మరో చోట భూమి కొనే పరిస్థితి లేదని బాధితులు చెప్పారు. ఫార్మాకోసం భూ సేకరణ జరుగుతుందని తమకు తెలియదని అన్నారు. బ్యాంకుల్లో రుణాలు ఇవ్వడం లేదని.. ఎందుకని అడిగితే ఫార్మా కంపెనీల ఏర్పాటుతో తమ భూములు పోతున్నందున వాటికి రుణాలు ఇవ్వడం కుదరదని చెప్పారని తెలిపారు. అప్పటివరకు ఇక్కడ ఫార్మా కంపెనీ వస్తుందని, తమ భూములు ఇవ్వాల్సి వస్తుందని గ్రహించలేదని అన్నారు.
హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బకి వెంకటయ్య బృందం సోమవారం లగచర్లలో పర్యటించనున్నది. కలెక్టర్‌పై దాడి జరిగిందనే నెపంతో పోలీసులు తమపై దాడులు చేసి అక్రమంగా అరెస్టులు చేశారని, లగచర్ల బాధితులు ఇటీవల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన చైర్మన్ బక్కి వెంకటయ్య.. జిల్లా కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు జారీ చేశారు. కమిషన్ బృందం సోమవారం లగచర్లలో పర్యటించి దళిత, గిరిజనుల భూముల బలవంత సేకరణ, పోలీసుల వేధింపులను బాధితులను స్వయంగా అడిగి తెలుసుకోనున్నది. అనంతరం సంగారెడ్డి జిల్లా జైలుకు వెళ్లి బాధితులను కలవనున్నది.