హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): ఆకతాయిల భరతం పట్టేందుకు తెలంగాణ పోలీస్‌శాఖ ఏర్పాటుచేసిన షీటీమ్స్‌పై బాధితుల్లో భరోసా పెరుగుతున్నది. బాధితుల సమాచారం గోప్యంగా ఉంచడం.. ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా వాట్సాప్, ఈమెయిల్, హాక్ఐ, డయల్ 100 వంటి మాధ్యమాల్లో ఫిర్యాదులు స్వీకరిస్తుండటంతో కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఇది వర్కింగ్ ఉమెన్, విద్యార్థినుల్లో మనోధైర్యాన్ని పెంచుతున్నది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు తమకు మొత్తం 5,125 ఫిర్యాదులు అందినట్టు అడిషనల్ డీజీ స్వాతిలక్రా తెలిపారు. 4,488 మంది ఆకతాయిలకు తమదైన శైలిలో కౌన్సెలింగ్ ఇప్పించి వారిలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నించినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా ఫిర్యాదులు ఆన్లైన్, ఇతర సాంకేతిక మాధ్యమాల ద్వారానే అందుతున్నట్టు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు షీటీమ్స్‌కు అందిన ఫిర్యాదులు, ఇతర అంశాలను వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ కమిషనరేట్లు, జిల్లాల్లో మొత్తం 331 షీటీమ్స్ పనిచేస్తున్నాయి.