హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): కారుణ్య ఉద్యోగం కోసం వయో పరిమితి మీరిన బాధితులు దాదాపు 1,500పైనే ఉన్నారు. ఒక్క ఆర్టీసీలోనే 100 మంది వరకు ఉండగా, నీటిపారుదలశాఖలోనూ పదుల సంఖ్యలో ఉన్నారు. ఇంటి పెద్ద మరణించడం.. పీడిస్తున్న అప్పులు.. కారుణ్య కోటాలో ఉద్యోగం దక్కకపోవడంతో బాధిత కుటుంబాల్లో తీరని ఆవేదన నెలకొంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి.. వన్ టైం సెటిల్మెంట్ కింద అందరికీ వయోపరిమితి సడలించి, ఉద్యోగాలు కల్పించాలని బాధితులు కోరుతున్నారు.
ఆగమ్యగోచరంగా..
ప్రభుత్వ ఉద్యోగి అకస్మాత్తుగా చనిపోతే అతనిపై ఆధారపడ్డ కుటుంబం పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారవుతున్నది. కుటుంబ పోషణ భారమై కొందరైతే కూలీనాలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నిబంధనల ప్రకారం కుటుంబ సభ్యుల్లో ఒకరికి కారుణ్య నియామకాల్లో అవకాశం కల్పించాలి. ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్‌లో ఏదో ఒక ఉద్యోగమిస్తారు. ఈ ఉద్యోగాల భర్తీలో జనరల్ క్యాటగిరీ వారికి 35 ఏండ్లు, ఎస్సీ,ఎస్టీ, బీసీలకు 40 ఏండ్ల వయోపరిమితిని అమలుచేస్తున్నా రు. అంతలోపు ఉంటేనే కారుణ్యనియామకాల్లో అవకాశం కల్పిస్తున్నారు. ఒక్కరోజు దాటినా ఉద్యోగం కల్పిండచంలేదు. ఈ ఒక్క ఈ నిబంధనతో వందలాది కుటుంబాలు ఉద్యోగాలకు దూరమయ్యాయి.
వీళ్లేం పాపంచేశారు..
ఉద్యోగ నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని ప్రభుత్వం 10 ఏండ్లు పెంచింది. జనరల్ అభ్యర్థులు 44, ఇతర అభ్యర్థులకు 49 ఏండ్లుగా ఉంది. దివ్యాంగులకు 50 ఏండ్ల వయస్సులోనూ ఉద్యోగాలకు పోటీపడే అవకాశాన్నిచ్చారు. కారుణ్య నియామకాలకు సడలింపు 39-40 ఏండ్లలోపే వర్తింపజేస్తున్నారు. వయోపరిమితి సడలింపు కారుణ్య నియామకాలకు ఎందుకివ్వరని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.
వారికి మోదం.. వీరికి ఖేదం
కారుణ్య నియామకాల్లో వయోపరిమితి సడలింపు విషయంలో సర్కారు రెండు నాల్కల ధోరణిని అవలంబిస్తున్నది. ఒక్కో దగ్గర ఒక్కో విధానాన్ని అనుసరిస్తున్నది. ఇటీవలే సింగరేణిలో (డిపెండెంట్ ఉద్యోగాల్లో) ఐదేండ్ల సడలింపునిచ్చి కారుణ్య నియామకాలు జరిపారు. పంచాయతీరాజ్శాఖలోనూ సడలించి ఏకంగా 585 మం దికి ఉద్యోగాలిచ్చారు. కానీ మిగతాశాఖల్లో వర్తింపజేయడంలేదు. ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగి చనిపోగా, ఆయన భార్యకు కేవలం 16 రోజులు ఎక్కువున్నందుకు అధికారులు ఉద్యోగం నిరాకరించారు.
ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు డీ లావణ్య. స్వస్థలం హనుమకొండ జిల్లా హసన్‌పర్తి. భర్త ఇంద్రదేవ్ ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేసేవాడు. ఓ రోజు అనారోగ్యం బారినపడ్డాడు. రూ.10 లక్షలు అప్పు చేసి చికిత్స చేయించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. 2022 జూన్‌లో ఇంద్రదేవ్ కన్నుమూశాడు. ఆరేండ్ల పాప, పదేండ్ల బాబు. పుట్టెడు అప్పులు, కుటుంబం గడిసే పరిస్థితి లేదు. కొండంత ఆశతో ఆర్టీసీలో కారుణ్య నియామకం (బ్రెడ్‌విన్నర్) కోసం దరఖాస్తు చేసుకున్నది. సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఫిజికల్ టెస్ట్ అన్ని పూర్తయ్యాయి. ఒక్క వయోపరిమితి అడ్డంకిగా వచ్చిపడింది. ఏడాది అధికంగా ఉన్నందుకు అధికారులు ఉద్యోగమివ్వలేదు. మంత్రి పొన్నం ప్రభాకర్ సహా అధికారులను కలిసి కనికరించమని వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది.
ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు బానోతు శివలాల్. తండ్రి నీటిపారుదలశాఖలో లష్కర్గా పనిచేస్తూ మరణించాడు. బీకాం, బీఈడీ చదివిన శివలాల్‌కు దివ్యాంగురాలైన కూతురు, మంచంపట్టిన తల్లి ఉన్నారు. తండ్రి ఉద్యోగం కోసం శివలాల్ దరఖాస్తు చేయగా, 40 ఏండ్లు నిండిన కారణంగా తిరస్కరించారు. దాదాపు 15 నెలలుగా సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. అయిన ఫలితం లేకుండా పోయింది.