ధర్మపురిలో లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం అభివృద్ధి పేరిట దౌర్జన్యకాండ నడుస్తున్నదా? ఇండ్లు, స్థలాల సేకరణ ప్రక్రియ బలవంతంగా సాగుతున్నదా? బహిరంగ మార్కెట్ విలువను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా.. తాము చెప్పిందే వేదం అన్నట్టు బాధితులను సర్కార్ బెదిరింపులకు గురిచేస్తున్నదా? కనీస సంప్రదింపులు చేయకుండా ఏకపక్షంగా రేటు నిర్ణయించి, ఇండ్లు ఖాళీ చేయాల్సిందే అంటూ బెదిరిస్తున్నదా? తాము డెవలప్మెంట్కు వ్యతిరేకం కాదని, తమ కష్టాన్ని కన్నీళ్లను, ఆ ఇండ్లతో పెనవేసుకున్న జ్ఞాపకాలను, ఆధారపడి ఉన్న జీవితాలను గుర్తించి..
బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం పరిహారం ఇప్పించాలంటూ బాధితులు వేడుకుంటున్నా.. లిఖితపూర్వకంగా విన్నపాలు ఇస్తున్నా బుట్టదాఖలు చేసి ఒంటెత్తు పోకడలకు పోతున్నదా? అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. నిజానికి ఇప్పటివరకు దేవాలయ విస్తరణపై ఎక్కడా చర్చలు జరిగిన దాఖలాలు లేవు. కనీసం బ్లూప్రింట్ కూడా ప్రకటించ లేదు. కానీ, ఉత్తర భాగంలో ఉన్న ఇండ్లను కూల్చేందుకు సర్కార్ సిద్ధం కావడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతుండగా.. సరైన పరిహారం ఇవ్వండి సహకరిస్తామంటూ బాధితులు చేస్తున్న విజ్ఞప్తులన్నీ అరణ్య రోదనగానే మిగులుతున్నాయి.
– కరీంనగర్, మే 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ ధర్మపురి
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 2021లోప్రసిద్ధ శైవక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయ విస్తరణ చేపట్టారు. అందులో భాగంగా రాజన్న ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ బద్దిపోచమ్మ ఆలయాన్ని కూడా విస్తరించారు. వేములవాడకు వచ్చే భక్తులు పట్టణ నడిబొడ్డున ఉన్న ఈ అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. భక్తులు ఇక్కడ బోనాలు సమర్పిస్తారు. బద్దిపోచమ్మ దేవాలయం పట్టణ నడిబొడ్డున ఉండటం వల్ల స్థల సేకరణ అసాధ్యమన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ, కేసీఆర్ దానిని సాధ్యం చేసి చూపించారు. ముందుగా దేవాలయ బ్లూప్రింట్ ప్రకటించారు. దేవాలయ విస్తరణకు, భక్తుల సౌకర్యార్థం అక్కడ ఎకరం స్థలం కావాలని అంచనా వేశారు. ఆ మేరకు విస్తరణలో పోయే 31 ఇండ్లతోపాటు మూడు ఓపెన్ స్థలాలను గుర్తించారు. ముందుగా బాధితులను పిలిపించి అధికారులు చర్చించారు. ఆనాడు అక్కడ మార్కెట్ విలువ గజానికి రూ.6వేలు ఉన్నది. బహిరంగ మార్కెట్లో గజానికి రూ.20 వేలు ఉన్నది. గుడి విస్తరణ కోసం ఇండ్లను కోల్పోతున్న బాధితులకు అండగా నిలువాలని భావించిన కేసీఆర్.. గజానికి రూ.30 వేల చొప్పున అంటే బహిరంగ మార్కెట్ విలువకన్నా అదనంగా ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. స్థలంతోపాటు ఇండ్లు కోల్పోయిన వారికి వారి నిర్మాణాల విలువను బట్టి పరిహారం అందించారు. బాధితులను మెప్పించి.. ఒప్పించి వారి అంగీకారంతో పనులు చేపట్టడంతో ఎటువంటి కోర్టు కేసులు లేకుండా విస్తరణ ప్రక్రియ సజావుగా పూర్తయింది.
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్టు కాంగ్రెస్ సర్కార్ చెప్తున్నది. ఇందుకు ధర్మపురి పట్టణంలో మొత్తం 7.23 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకోనున్నట్టు అధికారులు చెప్తున్నారు. దేవస్థానానికి ఉత్తరం వైపున ఉన్న 14 ఇండ్లు, వాటిపక్కనే ఉన్న పలు ఖళీ స్థలాలు కలిపి మొత్తం 1.03 ఎకరాలు, అలాగే బ్రాహ్మణ సంఘం పక్కనే ఉన్న 2.04 ఎకరాలు, శ్రీమఠం స్థలం (సర్వేనంబర్3/1), గోదావరి ఒడ్డున మంగలిగడ్డ ప్రాంతంలో 4.16 ఎకరాల స్థలం స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. సాధారణంగా దేవాలయాన్ని విస్తరిస్తే ముందుగా బ్లూప్రింట్ ప్రకటించాలి. ఎక్కడ ఏ నిర్మాణాలు వస్తాయి, సేకరించే స్థలం ఎందుకు ఉపయోగపడనుంది, వాటి ద్వారా భక్తులకు, లేదా ఆ ప్రాంతానికి ఎటువంటి మేలు జరుగుతుంది తదితర అంశాలను వివరించి బాధిత కుటుంబాలకు ముందుగా నోటీసులు ఇవ్వాలి. వారి అంగీకారం తీసుకోవాలి. ఆ మేరకు పరిహారం ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపి ఆమోదయోగ్యమైన చెల్లింపులకు చర్యలు తీసుకోవాలి. కానీ, ధర్మపురిలో అధికారులు ఈ ప్రక్రియకు స్వస్తి పలికినట్టు తెలుస్తున్నది. అత్యంత విలువైన ఇండ్లు, స్థలాలు కోల్పోతున్న బాధితులతో చర్చలు జరిపిన దాఖలాలు లేవు. ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కూడా బాధితులతో చర్చించి, ఒప్పించే ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు. వీటన్నింటినీ పక్కన పెట్టి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి.
దేవాలయానికి ఉత్తర భాగంలో ఉన్న ఇండ్లు, ఖాళీ స్థలాలకు బహిరంగ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. ఇక్కడ గజానికి రూ.30వేల నుంచి 40 వేల వరకు ధర పలుకుతున్నది. కానీ, సర్కార్ లెక్కల ప్రకారం మార్కెట్ విలువ గజానికి రూ.2,100 మాత్రమే ఉన్నది. ఇక్కడ ఇండ్లు, స్థలాల క్రయవిక్రయాలు జరుగకుండా చాలాకాలంగా బ్లాక్ లిస్టులో పెట్టడంవల్ల మార్కెట్ విలువ చాలా తక్కువగా ఉన్నదని బాధితులు చెబుతున్నారు. ప్రస్తుత బహిరంగ మార్కెట్ విలువకు అనుగుణంగా పరిహారం చెల్లిస్తే తాము దేవాలయ విస్తరణకు సహకరిస్తామని ఇప్పటికే అనేకసార్లు విన్నవించారు. లేఖలు ఇచ్చారు. అవేవీ పట్టించుకోకుండా మార్కెట్ విలువకు మూడు రెట్లు ఎక్కువగా లెక్క కట్టి, గజానికి రూ.6,300 మా త్రమే ఇస్తామని చెప్తూ అధికారులు పలువురికి నోటీసులు ఇచ్చారు. పునరావాసం కింద కుటుంబానికి రూ.12లక్షలు ఇస్తామని ప్రభుత్వం చెప్తున్నది.
బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే ప్రస్తుతం ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించిన పరిహారం వల్ల పెద్ద మొత్తంలో నష్టపోతున్నామని బాధితులు ఆందోళన వ్యక్తంచేస్తున్నా రు. అయినా అధికారులు వినకుండా కచ్చితంగా ఖాళీ చేయాల్సిందేనంటూ హుకుం జారీ చేస్తున్నారు. ఎవరైనా బాధితులు పరిహారం తీసుకోకపోతే కోర్టులో డిపాజిట్ చేసి, ఇండ్లు ఖాళీ చేయిస్తామని, బుల్డోజర్ను పంపి కూల్చివేస్తామని హెచ్చరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. సర్కార్ చెప్తున్న దానికి, బహిరంగ మార్కెట్‌కు భూమికి ఆకాశానికి ఉన్న తేడా ఉన్నదని, అలాంటిది మూడు రెట్లు పరిహారం ఇచ్చినా తమకు న్యాయం జరిగినట్టు ఎలా అవుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మంత్రితోపాటు జిల్లా ఉన్నతాధికారులు వాస్తవాలను గుర్తించి పరిహారం చెల్లింపునకు చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని పలువురు బాధితులు పేర్కొంటున్నారు. అలాగే దేవాలయ విస్తరణ బ్లూ ప్రింట్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.