చౌటకూర్, మే 31: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల వద్ద శనివారం భూనిర్వాసిత కుటుంబం ఆందోళనకు దిగింది. సుల్తాన్పూర్ శివారులోని సర్వేనంబర్ 40/ఈ లోని 3.05 ఎకరాల భూమి జేఎన్టీయూ నిర్మాణంలో కో ల్పోయిన బాధితుడు గొల్ల మల్లేశం కుటుంబసభ్యులు తమకు నష్టపరిహారం చెల్లించకుండా పనులు ఎలా చేపడుతారంటూ నిరసన చేపట్టారు. మల్లేశంకు చెందిన సర్వే నంబర్ 40/ఈ లోని 3.05 ఎకరాల భూమి 2012లో జేఎన్టీయూ కోసం తీసుకున్నారు.
ఈ భూమితో పాటుగా సర్వే నంబర్ 41లోని 1.35 ఎకరం లా వానిభూమి సైతం జేఎన్టీయూ నిర్మాణంలో కోల్పోయారు. భూమికి బదులు భూమి ఇవ్వాలని, లేనిపక్షంలో రెట్టింపు పరిహారం చెల్లించాలంటూ ఆయన మొండికేయడంతో 2011 నుంచి ఈ వివాదం కొనసాగుతున్నది. రెవెన్యూ అధికారుల సహకారంతో జేఎన్టీయూ పేరున భూసేకరణ అయిన భూమిని తిరిగి గొల్ల మల్లేశం పేరున పట్టా చేయించుకున్నాడు. ఇటీవల అధికాలు చెట్లు, ముళ్ల పొదలు తొలిగించే పనులు చేపట్టగా, మల్లేశం అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. భార్య సాయమ్మ, కుమారుడు రవి, కుటుంబ సభ్యులతో కలిసి పెట్రోల్ డబ్బాతో జేఎన్టీయూ కళాశాల వద్దకు ఆందోళన చేశారు. స్థానిక నాయకులు మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లగా ఆయన హామీ మేరకు బాధిత కుటుంబం ఆందోళన విరమించారు.