హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ రెండు రోజుల పర్యటన గురువారం ముగిసింది. బుధవారం ఆయన భార్యతో కలిసి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగిన రైతు సదస్సులో పాల్గొన్న తర్వాత సాయంత్రం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరులోని కన్హా శాంతివనానికి చేరుకున్నారు.
రాత్రి శాంతివనంలోనే బస చేశారు. గురువారం ఉదయం ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, దీవకొండ దామోదర్‌రావు, డాక్టర్ కే లక్ష్మణ్ తదితరులు ఉప రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలిశారు. దాదాపు అరగంటపాటు సమకాలీన అంశాలపై చర్చించారు. అనంతరం ఉప రాష్ట్రపతి ఢిల్లీకి వెళ్లడానికి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉన్నతాధికారులు ధన్‌ఖడ్ దంపతులకు వీడ్కోలు పలికారు.