VHP | నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం లోని పాతాళగంగ మహాలక్ష్మి దేవి అమ్మవారి దేవాలయం ముందు స్థలాన్ని కొందరు దౌర్జన్యంగా ఆక్రమించి లాడ్జి నిర్మించారని విశ్వ హిందూపరిషత్ (వీహెచ్పీ) తెలంగాణ రాష్ట్ర ధర్మప్రసార సహ ప్రముఖ్ సుభాష్ చందర్ ఆరోపించారు. వారు ఆలయ నిర్వాహకులు బాలకృష్ణమ్మ, ఆమె భర్త ఆది నారాయణలను బెదిరిస్తూ ఇబ్బందుల పాల్జేస్తున్నారని చెప్పారు. పోలీసు శాఖ ఈగల పెంట అధికారులకు పలు సార్లు తెలిపినా పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయమై సుభాష్ చందర్ శనివారం ఆలయాన్ని సందర్శించి, నిర్వాహకులు రుండా భవానీ@ బాలకృష్ణమ్మ, ఆమె భర్త ఆది నారాయణలను వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నారు.
దేవాలయం ముందు స్థలాన్ని ఆక్రమించిన వారికి ఈగల పెంట పోలీసు వారు మద్దతుగా ఉన్నారని ఆరోపించారు. దేవాలయం మైకులు తొలగించాలని పోలీసు అధికారులు పలు రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని సుభాష్ చందర్ పేర్కొన్నారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయ పవిత్రతకు, పూజా కార్యక్రమాలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని గత ఫిబ్రవరి 14, మార్చి నాలుగో తేదీన ఆలయ నిర్వాహకులు అమ్రాబాద్ మండల అధికారులు, పోలీసు అధికారులకు తెలిపినా స్పందించలేదని ఆరోపించారు.దేవాలయం ముందు లాడ్జి కట్టిన వారికి పోలీసులు మద్దతుగా నిలిచారని ఆరోపించారు.
దేవాలయంలో ఉదయం, సాయంత్రం ఒక గంట సేపైనా భక్తి పాటలు మైకులో పెట్టవద్దని ఇబ్బందులు కలిగిస్తున్నారన్నారు. గత నెల మూడో తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈగల పెంట ఎస్సై, పోలీసులు వచ్చి దేవాలయానికి, మైకులకు అనుమతి లేదని, మైకులు పెడితే తామే తీసుకెళ్తామని, దేవాలయానికి సీల్ వేస్తామని బెదిరించారని సుభాష్ చందర్ ఆరోపించారు. పోలీసులు అధికార పార్టీ నాయకులకు మద్దతుగా నిలవడం ఎంత వరకూ సమంజసం అని ప్రశ్నించారు. మందిర నిర్వాహకులను ఇబ్బంది పెడుతున్న అధికారులపై తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్, శివ కుమార్, జగన్, శ్రీకాంత్, భవానీ మాత, భవానీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.