(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): భారత శిల్ప కళా రంగంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన దిగ్గజ శిల్పి, పద్మభూషణ్ రామ్ వంజీ సుతార్ (100) కన్నుమూశారు. వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలతో బుధవారం అర్ధరాత్రి నోయిడాలోని స్వగృహంలో ఆయన మరణించారు. ఈ మేరకు ఆయన కుమారుడు అనిల్ సుతార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సుతార్ మరణంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
1925, ఫిబ్రవరి 19న మహారాష్ట్రలోని ధూలే జిల్లాలోని గోండూర్ అనే గ్రామంలో ఓ సాధారణ కుటుంబంలో సుతార్ జన్మించారు. శిల్పాలను సృజనాత్మకంగా చెక్కడాన్ని చిన్నప్పటి నుంచే నేర్చుకొన్న ఆయన.. ముంబైలోని జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ నుంచి గోల్డ్ మెడల్ అందుకొన్నారు. శిల్పకళా ప్రపంచంలో ఆయన అందించిన సేవలకు గానూ 1999లో పద్మశ్రీ, 2016లో పద్మభూషణ్, అదే ఏడాది ఠాగూర్ అవార్డుతో పాటు 2024లో మహారాష్ట్ర భూషణ్ అవార్డులు వరించాయి.
శిల్పకళా ప్రపంచంలో ‘కోహినూర్’గా పేరొందిన రామ్ సుతార్ తన సుదీర్ఘమైన కెరీర్లో ఎన్నో అద్భుతమైన శిలాప్రతిమలకు, కట్టడాలకు జీవంపోసి అంతర్జాతీయంగా ఖ్యాతిని గడించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా రికార్డులకు ఎక్కిన గుజరాత్లో నర్మదా నదీ తీరంలో కొలువుదీరిన 182 మీటర్ల ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’కి ప్రాణం పోయడంతో పాటు పార్లమెంట్ ప్రాంగణంలో ధ్యానముద్రలో ఉండే మహాత్మా గాంధీ విగ్రహానికి, గుర్రంపై స్వారీ చేసే ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాలకు తన సృజనను అద్దారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ దగ్గర కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన 125 అడుగుల ఎత్తైన బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా సుతారే తీర్చిదిద్దడం విశేషం. దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ స్టాచ్యూగా రికార్డులకు ఎక్కిన ఈ విగ్రహ తయారీకి 353 టన్నుల ఉక్కు, 112 టన్నుల కాంస్యం వాడారు. 2023 ఏప్రిల్ 14న మాజీ సీఎం కేసీఆర్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.