Builder Venugopal Reddy | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): ‘మా అన్న ఎప్పుడు రాఖీ కట్టినా జేబు లో ఎంత ఉంటే అంత ఆలోచించకుండా ఇచ్చేటోడు. ఈసారి రాఖీ పండుగకు వెయ్యి రూపాయలు చేతులపెట్టి మొహమంత ఎట్లనో పెట్టుకున్నడు. అర్ధగంట సేపు బాల్కనీల నిలబడి బాధపడ్డడు. మాకు ఏ సమస్య వచ్చినా అన్న దగ్గరికి పోతం. కానీ, అలాంటి అన్ననే మమ్మల్ని వదిలిపెట్టిపోయిండు. మా అన్న లేకపోతే మేం లేనట్లే. నా చావుకు మీరు కూడా ఒక కారణమంటూ సీఎం రేవంత్‌రెడ్డికి మా అన్న సూసైడ్ నోట్ రాసిండు…’
ఏడాదిగా రియల్ రంగం స్తబ్ధతతో తాను నిర్మించిన అపార్టుమెంట్‌లోని ఫ్లాట్లు అమ్ముడుపోక ఆత్మహత్య చేసుకున్న మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కొంపల్లికి చెందిన బిల్డర్ ముత్యాల వేణుగోపాల్‌రెడ్డి సోదరి కవిత రోదన ఇది. భార్య, పదేండ్ల కుమార్తెతో పాటు తల్లిదండ్రుల ఆలనాపాలనా చూసుకోవడమే కాకుండా ఇద్దరు చెల్లెళ్ల కుటుంబాలకు కూడా చేదోడువాదోడుగా నిలిచే వేణుగోపాల్‌రెడ్డి ఆర్థిక సమస్యలతో కలతచెంది నాలుగు పదుల వయసు దాటకుండానే అర్ధాంతరంగా తనువు చాలించడం కలచివేసింది. తన అన్న రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తూ ఎంత సంతోషంగా ఉండేవాడో… కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన హైడ్రా కారణంగా రియల్ రంగం ఎలా దెబ్బతిన్నదో.. చివరకు బ్యాంకులు బిల్డర్లకు రుణాలు ఇవ్వకుండా తీసుకున్న నిర్ణయం తమ కుటుంబాలను ఎంత మానసిక క్షోభకు గురి చేశాయనే వివరాలను కవిత కన్నీరుమున్నీరవుతూ వెల్లడించడం అందరినీ కంటతడి పెట్టిస్తున్నది. వేణుగోపాల్‌రెడ్డి సోదరి కవిత ఆవేదన ఆమె మాటల్లోనే..
‘నేను ఒకటనుకుంటే ఒకటైంది.. లోన్ రాలేదు. అందరికీ అప్పులు నేనెట్ల కడత’ అని మా అన్న ఐదారు నెలలుగా బాధపడుతుండు. ఆల్రెడీ ఇంట్లో ఉన్నయన్నీ పెట్టేసిన.. అమ్మానాన్నలకు ఖర్చులకు ఇయ్యడానికి లేవని మదనపడ్డడు. అడగకముందే మాకు అన్నీ ఇచ్చెటోడు. ఐదు నెలలు ఎంత ఇబ్బంది పడ్డాడో చూశా. ఎప్పుడు రాఖీ కట్టినా జేబులో ఎంత ఉంటే అంత ఇచ్చెటోడు. మొన్న వెయ్యి రూపాయలు తీసి ఇస్తుంటే ముఖమంత ఎట్లనో పెట్టుకున్నడు. ‘ఏమైందన్నా.. అందరికీ సమస్యలొస్తే నువ్వున్నవు. వెయ్యి రూపాయలు కట్నం పెడిటే ఇంత బాధపడుతున్నవు. అసలు ఏంటిదన్న ఇబ్బంది.. ’ అని చాలాసార్లు అడిగిన. ఏం లేదే.. ఏం కాదు.. అయిపోతది అన్నడు. మేమందరం అడిగినం.. ఏందన్నా డిప్రెషన్లకు ఎందుకెళ్లిపోతున్నవు? అందరం ఉన్నం కదా… ఎవరికి ఇచ్చేదుంది? కూర్చుని మాట్లాడదామన్నం. నా సమస్యను నేనే పరిష్కరించుకుంట అన్నడు. సరే.. అది (భవన నిర్మాణం) అయిపోయేందుకు ఎంత కావాలి? అని అడిగి అక్క సాయం చేసింది. బ్యాంకు లోన్‌కు ఐప్లె చేశాడు. కానీ, రాలేదు. ‘బిల్డర్ ప్రొఫైల్ ఈజ్ నెగెటివ్’ అని వచ్చింది. నెగెటివ్ ఎందుకు వచ్చింది? సిబిల్ .. అన్నీ బాగానే ఉన్నాయి కదా అని బ్యాంకుకెళ్లి అడిగిండు. కొత్తగా వచ్చిన గవర్నమెంట్ వల్ల బిల్డర్లకు లోన్లు ఇస్తే చాలా ప్రాబ్లం అవుతుందని బ్యాంకు వాళ్లు అన్నరు. రిజిస్ట్రేషన్ మార్చి అన్న భార్య ప్రణయ పేరు మీద ఐప్లె చేస్తమన్నడు. కో అప్లికెంట్ బిల్డరే ఉంటడు కదా.. ఇయ్యమన్నరు. వెంటనే ఈ నిర్ణయం (ఆత్మహత్య) తీసుకున్నడు. సీఎం రేవంత్‌రెడ్డి, హన్మంతరావు, డీఐజీ వీళ్లందరికీ 8 లేఖలు రాసిండు. అన్నయ్యే లేకపోతే మేం లేనట్టే!’ అని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు.
రేవంత్‌రెడ్డికి రాసిన లేఖలో..
‘రేవంత్‌రెడ్డి గారూ… మీరంటే చాలా గౌరవం. ఓటేసినవారిలో నేనూ ఒకడినండి. మీరు గెలిచారంటే చాలా సంతోషపడ్డాను. హైడ్రాతీసుకువచ్చారు. హైడ్రా వల్ల ఎంత మంది నష్టపోతున్నారో మీరు చూసుకోలేకపోయారు. మీరు ఒక ప్రోగాం స్టార్ట్ చేశారు.. మంచిదే, చెడ్డదని నేను అంటలేను. కానీ, మాలాంటి చిన్న బిల్డర్ల పరిస్థితి ఏంటనేది మీరు ఆలోచించారా? మేమేలా పైకి వస్తారనుకున్నారు? నా చావుకు మీరు కూడా ఒక కారణం’ అని రాసిండు.హన్మంతరావుకు ఓ లేఖ రాశాడు… ‘నేను నీ నియోజకవర్గానికి చెందినవాడిని. మీకు ఓటేసేవాడిలో నేనూ ఒకడిని. మా అమ్మానాన్నలకు బ్యాక్‌గ్రౌండ్ లేదు. వాళ్లకు కొంచెం మీరు సాయం చేయండి. నేను మధ్యలో ఆపేసిన బిల్డింగ్ నిర్మాణ పనులు మళ్లీ స్టార్ట్ అయ్యేలా చూడండి’ అని రాసిండు. ‘అతి కష్టం మీద మేం బ్యాంకుల్లో లోన్లు తీసుకుంటం. వేధింపుల వల్ల మాలాంటి వాళ్లు కష్టాల నుంచి బయటపడట్లేదు. నేను ఈరోజు చచ్చిపోతున్నా. నాలాంటి వాళ్లు ఇంకా ఎంతోమంది ఉన్నరు. వాళ్లనైనా ఆదుకోండి’ అని డీఐజీకి లేఖ రాసిన లేఖలో కోరిండు.
హైడ్రాతో తీవ్ర ప్రభావం
బిల్డర్ వేణుగోపాల్‌రెడ్డి ఆత్మహత్య చేసుకునే ముందు సీఎం రేవంత్‌రెడ్డి, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, డీఐజీ, కుటుంబ సభ్యులు.. ఇలా ఎనిమిది లేఖలు రాసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న గత నెల 29తోనే ఈ లేఖలు ఉన్నాయి. సీఎం రేవంత్‌రెడ్డికి రాసిన లేఖలో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం దుస్థితి ఎలా ఉందో వివరించారు. అసంపూర్తి భవనాన్ని పూర్తి చేయడంతో పాటు తల్లిదంహన్మంతరావుకు రాసిన లేఖలో కోరారు.