అచ్చంపేట : శ్రీశైలం ఎడమగట్టు సొరంగంలో ( SLBC Tunnel ) 52 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్ లోపల సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బందికి ఆక్సిజన్ ( Oxygen ) అందించడానికి వెంటిలేషన్ వ్యవస్థను పునరుద్ధరించారు. మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. 5 ఎస్కవేటర్ల ద్వారా మట్టి తవ్వకాలు చేపడుతూ కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి తరలిస్తున్నారు.
టన్నెల్ వద్ద సహాయక బృందాల ఉన్నతాధికారులతో ప్రత్యేక అధికారి శివ శంకర్ లోతేటీ ( Shiva Shanker) సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ సహాయక బృందాలు నిర్విరామంగా సేవలందిస్తూ, ఎంతో నిబద్ధతతో పని చేస్తున్నాయని, సొరంగంలో సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయని అన్నారు .
టన్నెల్ లోపల అత్యధికంగా ఉన్న మట్టిని ఎస్కవేటర్ల సహాయంతో కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు తరలించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని వివరించారు. డి వాటరింగ్ ప్రక్రియ కొనసాగుతుందని, సొరంగంలో సహాయక చర్యల్లో పాల్గొంటున్న సహాయక సిబ్బందికి అవసరమైన ఆక్సిజన్ అందించేందుకు వెంటిలేషన్ వ్యవస్థను మెరుగుపరుస్తున్నట్లు వెల్లడించారు.
సహాయక బృందాలు భద్రతకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ సమీక్షలో సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, ఎస్డీఆర్ఎఫ్ అధికారి గిరిధర్ రెడ్డి, జేపీ కంపెనీ సీనియర్ ప్రాజెక్టు ఇంజనీర్ సంజయ్ కుమార్ సింగ్,హైడ్రాధికారులు తదితరులు పాల్గొన్నారు.