నమస్తే తెలంగాణ ఎఫెక్ట్ స్టేషన్‌ఘన్‌పూర్, ఏప్రిల్ 8 : మూడేండ్లుగా ఆసరా పింఛన్ పొందుతున్న జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెంకు చెందిన అన్నెపు వెంకటయ్య పేరు లబ్ధిదారుల జాబితాలో మృతి చెందినట్లు నమోదు కావడంతో 8 నెలలుగా పింఛన్ నిలిచిపోయింది. ఈ విషయంపై ‘మీరు చనిపోయారు ..మీకు పింఛన్ రాదు’ అనే శీర్షికతో ‘నమస్తే తెలంగాణ’లో జనవరి 8న కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన అధికారులు వెంకటయ్య పేరును లబ్ధిదారుల జాబితాలో బతికి ఉన్నట్టు సరిచేసి ఎట్టకేలకు పింఛన్ మంజూరుచేశారు. రెండు రోజుల క్రితం పింఛన్ తీసుకున్న వెంకటయ్య, ఆయన కుటుంబం ఆనందం వ్యక్తంచేసింది. పింఛన్ వచ్చేలా కృషి చేసిన ‘నమస్తే తెలంగాణ’, కలెక్టర్‌కు వెంకటయ్య కృతజ్ఞతలు తెలిపారు.