బాసర, జూలై 16: బాసర ట్రిపుల్ ఐటీ ఇన్చార్జి వీసీగా ప్రొఫెసర్ వెంకటరమణను నియమిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ట్రిఫుల్ ఐటీలోని వీసీ కార్యాలయంలో శనివారం రాత్రి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం వెంకటరమణ ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అంతకు ముందు రాహుల్ బొజ్జా మూడేండ్ల పాటు ఇన్చార్జి వీసీగా పనిచేశారు. ఇన్చార్జి వీసీగా బాధ్యతలు స్వీకరించిన వెంకటరమణకు డైరెక్టర్ సతీష్, ట్రిపుల్ ఐటీ అధికారులు, టీచింగ్, నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ అభినందనలు తెలిపారు.
మెస్ కాంట్రాక్టర్లపై కేసు
ట్రిపుల్ ఐటీ మెస్ కాంట్రాక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఫుడ్ పాయిజన్‌తో సుమారు వంద మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఆదేశాల మేరకు మెస్‌లలో నమూనాలను సేకరించారు. ఘటనకు కారణమైన రెండు మెస్‌ల యజమానులు, ఇంచార్జీలపై సెక్షన్ 273/336, 59 ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ 2006 ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడటంతో వైద్యులు డిశ్చార్జి చేశారు.